జ‌గ‌ప‌తికి తిరిగిన‌ట్లే ఈయ‌న‌కూ తిరుగుతుందా?


‘లెజెండ్’ సినిమా రావ‌డానికి ముందు జ‌గ‌ప‌తిబాబు ప‌రిస్థితి ఏంటో అంద‌రికీ తెలిసిందే. హీరోగా అవ‌కాశాలు త‌గ్గిపోయి.. క్యారెక్ట‌ర్ రోల్స్ కూడా స‌రైన‌వి ప‌డ‌క.. డ‌బ్బుకోసం చిన్నా చిత‌కా సినిమాల్లో న‌టిస్తూ జ‌నాల ఆలోచ‌న‌ల్లోంచే వెళ్లిపోయే స్థితిలో ఉన్నారాయ‌న‌. అలాంటి ఆయనకి ‘లెజెండ్’ సినిమాలో విల‌న్‌గా జితేంద్ర అనే పాత్ర ఇచ్చి త‌న కెరీర్ మ‌లుపు తిరిగేలా చేశాడు బోయ‌పాటి శ్రీను.

బాల‌య్య‌కు విల‌న్‌గా జ‌గ‌ప‌తిబాబు అన‌గానే ఈ పాత్ర‌పై, సినిమాపై ప్రేక్ష‌కుల్లో ప్ర‌త్యేక ఆస‌క్తి నెల‌కొంది. ఆ అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్లే అన్నీ ఉండటంతో జగపతిబాబు సినిమాకు హైలైట్ అయ్యాడు. దర్శక నిర్మాతలు ఆయన వెంట పడటం మొదలుపెట్టారు. ఒకప్పుడు స్టార్ హీరోగా కొనసాగినప్పటికీ కంటే క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్‌గా ఆయనకు ఇప్పుడు డిమాండ్ ఎక్కువగా ఉండటం విశేషం. ఇప్పుడు బోయపాటి నుంచి తన కెరీర్‌కూ అలాంటి మలుపే ఆశిస్తున్నాడు శ్రీకాంత్.

బాలయ్య-బోయపాటి కలయికలో తెరకెక్కిన కొత్త చిత్రం ‘అఖండ’లో శ్రీకాంత్ విలన్ పాత్ర పోషిస్తున్న విషయం ఇంతకుముందే వెల్లడైంది. ఐతే ఆయన పాత్ర గురించి ఎలాంటి హింట్ లేదు. తాజాగా రిలీజ్ చేసిన ట్రైలర్లో శ్రీకాంత్ భయంకరమైన లుక్‌లో కనిపించాడు. ఒక సీన్లో అతను చెప్పిన డైలాగ్ కూడా ఆకట్టుకుంది. చూస్తుంటే ఈ పాత్ర చాలా వయొలెంట్‌గా ఉండేలాగే ఉంది. బాలయ్యతో దీటుగా తలపడేలాగే కనిపిస్తున్నాడు శ్రీకాంత్.

హీరో కావడానికి ముందే నెగెటివ్ రోల్స్‌తో ఆకట్టుకున్న శ్రీకాంత్.. లీడ్ రోల్స్‌లో సక్సెస్ అయ్యాక ఫ్యామిలీ సినిమాల హీరో అయిపోయాడు. ఎప్పుడో ఒకసారి మాత్రమే రఫ్ క్యారెక్టర్లు చేశాడు. ఐతే హీరోగా అవకాశాలు తగ్గిపోయాక కొన్నేళ్ల కిందట ‘యుద్ధం శరణం’ మూవీతో విలన్‌గా రీఎంట్రీ ఇచ్చాడు కానీ.. ఆ సినిమా ఆడలేదు. విలన్‌గా బ్రేక్ రాలేదు. కెరీర్ నామమాత్రంగా నడుస్తోంది. ఇలాంటి టైంలో ఇప్పుడు మళ్లీ ‘అఖండ’తో విలన్ అవతారం ఎత్తాడు శ్రీకాంత్. మరి ‘లెజెండ్’లో జగపతిలాగే శ్రీకాంత్ సైతం బోయపాటి ద్వారా బ్రేక్ అందుకుని బిజీ అయిపోతాడేమో చూడాలి.