బాల‌య్య‌-బోయ‌పాటి.. ఒక‌టే ఫార్ములా

నంద‌మూరి బాల‌కృష్ణ‌-బోయ‌పాటి శ్రీనుల కాంబినేష‌న్ అంటే చాలు అభిమ‌మానుల‌కు పూన‌కాలు వ‌చ్చేస్తాయి. బాల‌య్య కెరీర్ స్లంప్‌లో ఉన్న టైంలో వీరి క‌ల‌యిక‌లో వ‌చ్చిన తొలి చిత్రం సింహా అప్ప‌ట్లో పెద్ద బ్లాక్‌బ‌స్ట‌ర్ అయింది. ఆ త‌ర్వాత కొన్నేళ్ల‌కు మ‌ళ్లీ ఈ ఇద్ద‌రూ క‌లిసి చేసిన లెజెండ్ సైతం అదే స్థాయిలో విజ‌యవంతం అయ్యింది. ఈ జోడీ ఇప్పుడు అఖండ‌తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోంది.

ఈ సినిమా ట్రైల‌ర్‌, రిలీజ్ డేట్ కోసం అభిమానుల ఎదురుచూపులు ఎట్ట‌కేల‌కు ఫ‌లించాయి. ఆదివారం రాత్రి అఖండ ట్రైల‌ర్ లాంచ్ అయింది. ఇందులోనే రిలీజ్ డేట్ కూడా ప్ర‌క‌టించారు. అనుకున్న‌ట్లే డిసెంబ‌రు 2న సినిమా థియేట‌ర్ల‌లోకి దిగ‌బోతోంది. ఏ సినిమాకైనా ట్రైల‌ర్ చూస్తే దాని క‌థేంటో అర్థ‌మైపోతుంది. అఖండ కూడా అందుకు మిన‌హాయింపు కాదు.

అఖండ సైతం బాల‌య్య‌-బోయ‌పాటి కాంబినేష‌న్లో వ‌చ్చిన గ‌త రెండు చిత్రాల లైన్లోనే సాగ‌బోతోంద‌ని అర్థ‌మ‌వుతోంది. వాటిలో, ఇందులో బాల‌య్య ద్విపాత్రాభిన‌య‌మే చేశాడు. ముందు వ‌చ్చిన రెండు సినిమాల‌ను గ‌మ‌నిస్తే.. ఒక ప్రాంతంలో విల‌న్ల అరాచ‌కాలు అడ్డూ అదుపూ లేకుండా సాగిపోతుండ‌టం.. అవి ప‌తాక స్థాయికి చేరిన స‌మ‌యానికి ఒక సేవియ‌ర్ లాగా రెండో బాల‌య్య రంగంలోకి దిగ‌డం.. ఈ లైన్ క‌నిపిస్తుంది.

అఖండ సైతం స‌రిగ్గా ఇదే లైన్లో న‌డిచేలా క‌నిపిస్తోంది. సింహా, లెజెండ్ చిత్రాల్లో ముందు క‌నిపించే యంగ్ బాల‌య్య మామూలుగా ఉంటాడు. రెండో బాల‌య్య గెట‌ప్ డిఫ‌రెంట్‌గా ఉంటుంది. అఖండ‌లోనూ అంతే. కాక‌పోతే గ‌త రెండు చిత్రాల‌తో పోలిస్తే ఈ పాత్ర‌, దాని గెట‌ప్ మ‌రింత డిఫ‌రెంట్‌గా, వైబ్రంట్‌గా ఉండేలా చూసుకున్నాడు బోయ‌పాటి. ఐతే రొటీన్ మాస్ అనిపిస్తున్న‌ప్ప‌టికీ.. అభిమానుల‌కు, మాస్‌కు గూస్ బంప్స్ ఇచ్చే మూమెంట్స్, ఎలివేష‌న్లు, డైలాగులు, గ్రాండియ‌ర్‌కు మాత్రం అఖండలో లోటు లేన‌ట్లే ఉంది. కాబ‌ట్టి ఈ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేసేలాగే క‌నిపిస్తోంది.