హీరోలు వెంటపడేలా చేస్తాడనుకుంటే..

Rx 100 Director Ajay
Rx 100 Director Ajay

రామ్ గోపాల్ వర్మ దగ్గర శిష్యరికం చేసిన వాళ్లలో చాలామది బోల్డ్‌గా మారిపోతారు. ఎవరేమనుకుంటారన్న పట్టింపు లేకుండా తమకు ఏమనిపిస్తే అది మాట్లాడేస్తుంటారు. ఇండస్ట్రీలో చాలామంది చూపించే లౌక్యం వర్మ శిష్యుల దగ్గర కనిపించదు. కౌంటర్లు, సెటైర్లు, బోల్డ్ కామెంట్లకు వర్మ శిష్యులు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తుంటారు.

అజయ్ భూపతి కూడా అందుకు మినహాయింపేమీ కాదు. అతను ఔట్ స్పోకెన్ అనే విషయం ఇంతకుముందే చాలాసార్లు చూశాం. ‘ఆర్ఎక్స్ 100’ సినిమా సూపర్ సక్సెస్ కావడంతో అజయ్ కాన్ఫిడెన్స్ ఇంకా ఎక్కువై కొన్నిసార్లు బోల్డ్ కామెంట్లు చేశాడు.

తన రెండో సినిమా ‘మహాసముద్రం’ కథను తిరస్కరించిన ఒక హీరో మీద చేసిన కామెంట్ కూడా అప్పట్లో చర్చనీయాంశం అయింది. ఈ సినిమాను రిజెక్ట్ చేసిన హీరోలు రిగ్రెట్ అయ్యేలా చేస్తానని సన్నిహితుల దగ్గర అజయ్ చాలా ధీమాగా మాట్లాడినట్లు కూడా అప్పట్లో వార్తలొచ్చాయి.

‘మహాసముద్రం’ గురించి రిలీజ్ ముంగిట అజయ్ మాట్లాడిన మాటలు చూస్తే.. అతడి ఖాతాలో ఇంకో బ్లాక్ ‌బస్టర్ పడటం ఖాయమని, ఈ సినిమాను వదులుకున్న వాళ్లు పశ్చాత్తాపం చెందుతారని అనిపించింది. ఈ సినిమా తర్వాత కచ్చితంగా అజయ్ వెంట చాలామంది హీరోలు పడేలా చేసుకుంటాడన్న అంచనాలు కూడా కలిగాయి. కానీ ‘మహాసముద్రం’ థియేటర్లలోకి దిగాక కథ పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు అజయ్‌తో సినిమా అంటే హీరోలు భయపడే పరిస్థితి తలెత్తింది.

నిర్మాతలు కూడా వెనుకంజ వేస్తున్నారు. ‘ఆర్ఎక్స్ 100’ సక్సెస్ చూసి ఫిదా అయిపోయి ‘మహాసముద్రం’ విషయంలో అజయ్‌కు పూర్తి ఫ్రీడమ్ ఇచ్చి అతను కోరిన వనరులన్నీ సమకూర్చి పెట్టిన అజయ్ సుంకర.. ఈ సినిమా వల్ల చాలా నష్టపోయాడు. అజయ్ సక్సెస్ మీద ఉన్నపుడే హీరోలు అతడి కథను తిరస్కరించారు. ఇప్పుడు అతను పెద్ద డిజాస్టర్ ఇచ్చాడు. ఈ స్థితిలో హీరోను, నిర్మాతను సెట్ చేసుకుని మూడో సినిమాను పట్టాలెక్కించడానికి అజయ్ చాలానే కష్టపడాల్సి వచ్చేలా ఉంది.