అమేజాన్ ప్రైమ్‌.. ఇదేం స్ట్రాట‌జీ?


ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రిలో మ‌ల‌యాళ సినిమా దృశ్యం-2 థియేట్రిక‌ల్ రిలీజ్ స్కిప్ చేసి నేరుగా అమేజాన్ ప్రైమ్‌లో రిలీజ్ కావ‌డం తెలిసిన సంగ‌తే. సినిమా మొద‌ల‌య్యే టైంలోనే ప్రైమ్ వాళ్ల‌తో నిర్మాణ సంస్థ డైరెక్ట్ ఓటీటీ రిలీజ్‌కు ఒప్పందం చేసుకుంది. ప్రైమ్ వాళ్లు ఇచ్చిన అడ్వాన్స్‌తోనే ఈ సినిమా తీసిన‌ట్లుగా కూడా వార్త‌లొచ్చాయి. నిర్మాత‌లు మంచి లాభానికి సినిమాను అమ్మారు. సినిమాకు అదిరిపోయే టాక్ రావ‌డం, రికార్డు స్థాయిలో వ్యూయ‌ర్ షిప్ రావ‌డంతో ప్రైమ్ వాళ్లు కూడా సూప‌ర్ హ్యాపీ.

కానీ ఇదే ఓటీటీ ఇప్పుడు తెలుగు దృశ్యం-2ను కొన‌డ‌మే విడ్డూరంగా అనిపిస్తోంది. డైరెక్ట్ త‌మ ఓటీటీలో రిలీజైన సినిమాను తెలుగు న‌టీన‌టుల్ని పెట్టి మ‌క్కీకి మ‌క్కీ తీస్తుంటే.. అదే చిత్రాన్ని డైరెక్ట్ రిలీజ్ కోసం ప్రైమ్ వాళ్లే కొన‌డంలో లాజిక్ ఏంటో అర్థం కాదు.

తెలుగులో వెంకీతో పాటు కొంద‌రు వేరే న‌టీన‌టులు క‌నిపించ‌నున్నారు అన్న మాటే త‌ప్ప ఒరిజిన‌ల్‌కు దీనికి ఏమీ తేడా ఉండ‌దు. దృశ్యం వ‌చ్చిన రోజులు వేరు. అప్పుడు మ‌ల‌యాళ సినిమాల‌తో మ‌న జ‌నాల‌కు యాక్సెసే లేదు. అప్పుడు ఓటీటీల జాడే లేదు. కానీ ఇప్పుడు రోజులు మారిపోయాయి. దృశ్యం-2కు అదిరిపోయే టాక్ రావ‌డం, మోహ‌న్ లాల్ ఇప్పుడు మ‌న వాళ్ల‌కు బాగా అల‌వాటైపోవ‌డంతో ప్రైమ్‌లో ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్ష‌కులు కూడా బాగానే చూసి ఉంటారు.

తెలుగులో కూడా సినిమా చూసే అవ‌కాశం క‌ల్పించాల‌నుకుంటే ఒరిజిన‌ల్‌కే డ‌బ్బింగ్ చెప్పించి వాయిస్‌లు యాడ్ చేసేస్తే పోయేది క‌దా. అదే ద‌ర్శ‌కుడు మ‌క్కీకి మ‌క్కీ అన్న‌ట్లుగా తెలుగులో తీసిన సినిమాను మ‌ళ్లీ కోట్లు పెట్టి అమేజాన్ వాళ్లే హ‌క్కులు తీసుకుని డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ చేయ‌డం ఎంత వ‌ర‌కు ప్ర‌యోజ‌నం ఉంటుంది అనే ప్ర‌శ్న‌లు త‌లెత్తుతున్నాయి. మ‌రి అమేజాన్ టీం ఆలోచ‌న ఏంటో?