మన దర్శక ధీరుడు రాజమౌళికి సినిమా తీయడం మాత్రమే బాగా వచ్చనుకుంటే పొరబాటే. ఆయనకు సినిమాను ఎలా మార్కెట్ చేయాలో కూడా చాలా బాగా తెలుసు. బాహుబలిని తనదైన మార్కెటింగ్ స్కిల్స్‌తో ఎలా పాన్ ఇండియా లెవెల్లో ప్రమోట్ చేసి అన్ని భాషల ప్రేక్షకుల్లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేశాడో.. ఆ సినిమాను ఏ స్థాయి సక్సెస్ చేశాడో తెలిసిందే. ఐతే బాహుబలికి జరిగినట్లు అన్ని సినిమాలకూ జరుగుతుందా.. అలాంటి మ్యాజిక్ పునరావృతం చేయడం కష్టం అన్న వాళ్లకు ఆర్ఆర్ఆర్‌తో తిరుగులేని సమాధానం చెబుతున్నాడు జక్కన్న.
బాహుబలి స్థాయిలో ఈ సినిమాపై క్యూరియాసిటీ పెంచడంలో జక్కన్న ఇప్పటికే సక్సెస్ అయ్యాడు. రిలీజ్ టైంకి హైప్ మరింత పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. ఆర్ఆర్ఆర్ నుంచి రిలీజ్ చేసిన ప్రతి ప్రోమో ప్రేక్షకులను ఆకట్టుకుంది. సినిమాపై అంచనాలు పెంచింది.
ఈ సినిమాలోంచి ఇప్పటికే రెండు పాటలు రిలీజ్ చేయగా.. వాటికి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు మూడో పాటకు ముహూర్తం కుదిరినట్లు సమాచారం. మరి కొన్ని రోజుల్లోనే థర్డ్ సింగిల్ రిలీజ్ చేయబోతున్నారు. ఐతే ఈ సాంగ్ లాంచింగ్ విషయంలో డిఫరెంట్ ప్లాన్ రెడీ చేశారట.
ఎప్పట్లా సోషల్ మీడియాలో పాటను రిలీజ్ చేయడం కాకుండా.. ఆర్ఆర్ఆర్ సినిమాతో ఒప్పందం చేసుకున్న పీవీఆర్ సినిమాస్‌కు సంబంధించి దేశవ్యాప్తంగా స్క్రీన్లలో ఆర్ఆర్ఆర్ మూడో పాటను రిలీజ్ చేయనున్నారట. దాని లిరికల్ వీడియోను ముందు పీవీఆర్ స్క్రీన్లలో ప్రదర్శించి ఆ తర్వాత సోషల్ మీడియాలోకి తీసుకొస్తారట. ఇటీవల రిలీజ్ చేసిన ఆర్ఆర్ఆర్ గ్లింప్స్‌ను థియేటర్లలో వేరే సినిమాల మధ్యలో ప్రదర్శిస్తే అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ఇలా ఒక పాటను సినిమా హాళ్లలో ప్రదర్శిస్తే దానికొచ్చే మైలేజీనే వేరుగా ఉంటుందనడంలో సందేహం లేదు.