‘జాతిరత్నాలు’ భామ.. ఎట్టకేలకు

‘జాతిరత్నాలు’ సినిమాతో మంచి పేరు సంపాదించింది కొత్తమ్మాయి ఫరియా అబ్దుల్లా. ఈ హైదరాబాదీ అమ్మాయి నటన మీద మక్కువతో కాలేజీ రోజుల్లోనే థియేటర్స్ గ్రూప్స్‌లో చేరి.. అక్కడ ప్రతిభ చాటుకుని.. అనుకోకుండా దర్శకుడు నాగ్ అశ్విన్ కళ్లల్లో పడి.. అతడి నిర్మాణంలో కేవీ అనుదీప్ రూపొందించిన ‘జాతిరత్నాలు’లో అవకాశం దక్కించుకుంది.

రెగ్యులర్ స్టార్ హీరోయిన్లకు భిన్నమైన లుక్, నటనతో ఆమె ప్రత్యేకంగా కనిపించింది ‘జాతిరత్నాలు’లో. ఈ సినిమాతో ఆమె దశ తిరిగిపోతుందన్న అంచనాలు కలిగాయి కానీ.. వెంటనే అవకాశాలు మాత్రం రాలేదు. రవితేజ సరసన ఓ సినిమాలో కథానాయికగా ఎంపికైనట్లు వార్తలొచ్చాయి కానీ.. అవి నిజం కాలేదు. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమాలో చిన్న క్యామియో లాంటి రోల్ మినహాయిస్తే ఫరియా ఇప్పటిదాకా చెప్పుకోదగ్గ అవకాశం అందుకోలేదు.

ఐతే ఎట్టకేలకు ఫరియాకు ఓ పేరున్న సినిమాలో అవకాశం దక్కినట్లు సమాచారం. శ్రీను వైట్ల దర్శకత్వంలో మంచు విష్ణు హీరోగా తెరకెక్కబోయే ‘డి అండ్ డి’కి ఆమెనే కథానాయికగా ఎంచుకున్నారట. నిజానికి ఫరియా టాలెంటుకి ఇంతకంటే మంచి అవకాశమే దక్కాలి కానీ.. తనకు ఛాన్సులే రాని నేపథ్యంలో దీన్నే మహాప్రసాదం అనుకోవాలి. మంచు విష్ణు, శ్రీను వైట్ల పునర్వైభవం కోసం గట్టిగా ప్రయత్నించే అవకాశం ఉండటంతో ఈ సినిమా హిట్టయి తన కెరీర్‌కు కూడా ఉపయోగపడుతుందని ఫరియా ఆశించవచ్చు.

విష్ణు-వైట్ల కలయికలో వచ్చిన ‘ఢీ’ పెద్ద హిట్ కాగా.. ఆ లైన్స్‌లోనే ఈ సినిమాను తీయబోతున్నారు. పేరు ఆ చిత్రాన్ని తలపించినా ఇది సీక్వెల్ కాదంటోంది చిత్ర బృందం. దీన్ని మంచు విష్ణునే స్వయంగా నిర్మించబోతున్నాడు.