‘పుష్ప’ ఇంటర్నేషనల్ ప్రమోషన్


ఈ రోజుల్లో సినిమాల కోసం ప్రేక్షకులను థియేటర్లను రప్పించడం అంత సులువైన విషయం కాదు. రెగ్యులర్ మూవీ గోయర్స్ సంగతలా ఉంచేస్తే.. మిగతా ప్రేక్షకులను ఆకర్షించడానికి ప్రమోషన్ కొంచెం గట్టిగా చేయాల్సిందే. టాక్‌తో సంబంధం లేకుండా ఓపెనింగ్స్ ద్వారా సినిమాను బయటపడేయాలంటే ప్రి రిలీజ్ ప్రమోషన్లు ఒక రేంజ్‌లో ఉండాల్సిందే. అందుకే సినిమా సెట్స్ మీదికి వెళ్లడానికి ముందే ప్రమోషన్లు మొదలుపెట్టేస్తుంటారు ఫిలిం మేకర్స్. షూటింగ్‌కు సమాంతరంగా సోషల్ మీడియా ప్రమోషన్లు చేస్తూ.. రిలీజ్ ముంగిట ఆఫ్ లైన్ ప్రమోషన్లను హోరెత్తించాల్సిందే.

ఈ విషయంలో ‘పుష్ప’ టీం పక్కా ప్రణాళికతో అడుగులు వేస్తోంది. సినిమా మొదలైన దగ్గర్నుంచి ‘పుష్ప’ ఎప్పుడూ వార్తల్లోనే ఉండేలా ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ ఇస్తూ.. ఏదో ఒక విశేషాన్ని పంచుకుంటూ ముందుకు సాగుతోంది చిత్ర బృందం.

ఇక సినిమా విడుదలకు సమయం దగ్గర పడటంతో ప్రమోషన్స్‌ను మరో స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఒక ఇంటర్నేషనల్ ఈవెంట్ ప్లాన్ చేసినట్లు సమాచారం. కొన్ని రోజుల ముంగిట ప్రచారం జరిగినట్లే ఈ ఈవెంట్‌ను దుబాయ్‌లో ప్లాన్ చేస్తున్నారు. ఇందుకు ముహూర్తం కూడా కుదిరిందన్నది తాజా సమాచారం. డిసెంబరు 3న ‘పుష్ప’ టీం అంతా దుబాయ్‌లో ఉండబోతోందట. అక్కడో స్పెషల్ ప్రమోషనల్ ఈవెంట్ చేస్తున్నారట. ఈ ఈవెంట్ ద్వారా దేశవ్యాప్తంగానే కాక అంతర్జాతీయ స్థాయిలో ‘పుష్ప’ గురించి ఒక చర్చ జరిగేలా చేయనున్నారట.

ఇంతకుముందు ‘2.0’ ఆడియో వేడుకను దుబాయ్‌లో చేయడం గుర్తుండే ఉంటుంది. కానీ ఆ ఈవెంట్ అనుకున్నంత సక్సెస్ కాలేదు. ‘పుష్ప’ ఈవెంట్‌ను మాత్రం కొంచెం సందడిగానే చేయబోతున్నారని సమాచారం. అక్కడి నుంచి తిరిగొచ్చాక ఇండియాలో వివిధ నగరాల్లోనూ ప్రమోషనల్ ఈవెంట్లు ఉంటాయట. చివరగా హైదరాబాద్‌లో పెద్ద ఎత్తున్న ప్రి రిలీజ్ ఈవెంట్ చేయబోతున్నారు. ‘పుష్ప’ డిసెంబరు 17న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.