సూర్య గొప్ప మనసుకు హ్యాట్సాఫ్


దక్షిణాదిన సినిమా పరంగా.. వ్యక్తిగతంగా సామాజిక బాధ్యత ఎప్పుడూ మరవని వ్యక్తుల్లో సూర్య ఒకడు. తెరపై తరచుగా గొప్ప గొప్ప పాత్రలు చేయడం.. సీరియస్ ఇష్యూలను చర్చించడం.. సొసైటీకి మంచి చేసే, జనాల్లో ఆలోచన రేకెత్తించే, వారికి మంచి సందేశాలనిచ్చే సినిమాలను చేయడం.. నిర్మించడం చేస్తుంటాడు సూర్య. అలాగే వ్యక్తిగతంగా చాలా పెద్ద స్థాయిలో అతను సేవా కార్యక్రమాలు చేపడుతుంటాడన్న సంగతీ తెలిసిందే. కొన్ని సామాజిక సమస్యల మీద గట్టిగా గళం వినిపించడంలోనూ సూర్యకు మంచి పేరుంది. అతడికున్న ఈ ఇమేజ్ కొన్ని పాత్రల విషయంలోనూ ప్రతిఫలించి ఆ క్యారెక్టర్లకు నిండుదనం తెచ్చి పెడుతుంటుంది.

తాజాగా సూర్య నుంచి వచ్చిన ‘జై భీమ్’ విషయంలో అదే జరిగింది. తమిళనాట జరిగిన ఓ లాకప్ డెత్ ఆధారంగా గొప్ప కథాకథనాలతో తెరకెక్కిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. అందులో సూర్య చేసిన చంద్రు పాత్ర అందరినీ కట్టి పడేసింది. ఇలాంటి సినిమాకు హీరోగానే కాక నిర్మాతగా కూడా సూర్య ఇచ్చిన సపోర్ట్ గురించి ఎంత చెప్పినా తక్కువే. అందుకే ఈ సినిమాను అందరూ ఓన్ చేసుకుని దాన్ని మరింతగా జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు.

ఈ సినిమా ద్వారా ఆదివాసీల బాధల్ని జనాలకు తెలిసేలా చేసి.. అందరి దృష్టీ వారిపై పడేలా చేయడమే కాదు.. వారికి నేరుగా తన ద్వారా కోటి రూపాయల సాయం అందించడం ద్వారా తన గొప్ప మనసును చాటుకున్నాడు సూర్య. ఆదివాసీల విద్య కోసం ఉపయోగించాలని కోరుతూ తమిళనాడు ముఖ్యమంత్రి సహాయ నిధికి ఈ కోటి రూపాయల విరాళాన్ని సూర్య అందజేశాడు.

సినిమా రిలీజ్ టైంలోనే ఈ సాయం గురించి ప్రకటించిన సూర్య.. ఇప్పుడు తన భార్య జ్యోతికతో కలిసి ముఖ్యమంత్రిని కలిసి ఈ చెక్కును అందజేశాడు. సినిమా నుంచి వచ్చిన లాభాల్లోంచే ఈ కోటి రూపాయలు పక్కన పెట్టి ఆదివాసీలకు అందిస్తున్నాడు సూర్య. ఇలాంటి సినిమా చేయడమే గొప్ప విషయం అంటే.. ఇంత పెద్ద మొత్తంలో ఆదివాసీలకు సాయం అందించడం ద్వారా సూర్య అందరి మనసులూ దోచేశాడు.