‘రాజా విక్రమర్క’ రాసే టైంకి కార్తికేయ ఎవరో తెలీదు

టాలీవుడ్ దర్శకుల్లో చాలామంది హీరోను బట్టి కథ రాసేవాళ్లే. ముందు హీరో ఫిక్సయ్యాక కథలు రాయడం.. లేదంటే కథ రాసేటపుడే ఒక హీరోను దృష్టిలో ఉంచుకోవడం జరుగుతుంటుంది. ముందు కథ రాసి దానికి సెట్టయ్యే హీరోలను ఎంచుకోవడం చాలా తక్కువ సందర్భాల్లో జరుగుతుంటుంది.

ఈ వారం ప్రేక్షకుల ముందుకు రానున్న ‘రాజా విక్రమార్క’ ప్రోమోలు చూస్తే.. కార్తికేయకు పర్ఫెక్ట్‌గా సెట్ అయిన సినిమాలా కనిపిస్తోంది. దీంతో దీని దర్శకుడు శ్రీ సరిపల్లి కార్తికేయను దృష్టిలో ఉంచుకునే కథ రాసి ఉంటాడని భావిస్తున్నారు. కానీ అది వాస్తవం కాదంటున్నాడు ఈ కొత్త దర్శకుడు. ఈ కథ రాసే టైంకి కార్తికేయ ఎవరో కూడా తెలియదని అతను వెల్లడించాడు. ఈ కథ పూర్తయ్యాకే ‘ఆర్ఎక్స్ 100’ సినిమా రిలీజైందని.. ఆ సినిమాలో, దాని ప్రమోషన్లలో కార్తికేయను చూసి ఇతడికీ కథ పర్ఫెక్ట్‌గా ఉంటుందనిపించి తనను సంప్రదించానని.. కాకపోతే వేరే కమిట్మెంట్ల వల్ల అతనీ సినిమా చేయడం ఆలస్యమైందని మీడియాతో మాట్లాడుతూ శ్రీ సరిపల్లి వెల్లడించాడు.

ఇక తన నేపథ్యం గురించి వివరిస్తూ.. తాను పుట్టి పెరిగింది విజయవాడలో అని.. ఐతే సినిమాల మీద ఆసక్తితో 22 ఏళ్ల వయసులో యుఎస్‌కు వెళ్లి నాలుగేళ్ల పాటు ఫిలిం మేకింగ్ కోర్సు చేశానని.. తర్వాత టాలీవుడ్‌లో అడుగు పెట్టి దర్శకుడు వి.వి.వినాయక్ దగ్గర అసిస్టెంట్‌గా చేరానని.. తర్వాత మరికొంతమంది దగ్గర పని చేసి సొంతంగా కథలు తయారు చేసుకుని.. ‘రాజా విక్రమార్క’తో దర్శకుడిగా తొలి అవకాశం అందుకున్నానని శ్రీ తెలిపాడు.

తన రెండో సినిమా ‘అల’ పేరుతో రానుందని.. దానికి స్క్రిప్టు పూర్తయిందని.. అందులో ఎవరు నటిస్తారన్నది ‘రాజా కార్తికేయ’ విడుదల తర్వాతే తేలుతుందని అతనన్నాడు. ‘రాజా విక్రమార్క’ నాగార్జున నటించిన ‘నిర్ణయం’ తరహాలో వినోదాత్మకంగా సాగే కాప్ థ్రిల్లర్ మూవీ అని, ఇది కచ్చితంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని శ్రీ ధీమా వ్యక్తం చేశఆడు.