పునీత్ ఫ్యామిలీ డాక్టర్‌కు బందోబస్త్

కన్నడ సినిమాల్లో పెద్ద స్టార్లలో ఒకడైన పునీత్ రాజ్ కుమార్ హఠాత్తుగా ప్రాణాలు కోల్పోయి కోట్లాది మంది అభిమానుల్ని శోకసంద్రంలో ముంచెత్తాడు. అతను మరణించి దాదాపు పది రోజులు కావస్తున్నా ఇప్పటికీ అభిమానులు ఆ విషయాన్ని నమ్మలేకపోతున్నారు. జీర్ణించుకోలేకపోతున్నారు. పునీత్ సమాధి సందర్శనకు నాలుగు రోజుల కిందటే అవకాశం కల్పించగా.. అప్పట్నుంచి జనాలు పోటెత్తుతున్నారు.

వర్షంలో కూడా దైవదర్శనం కోసం ఎదురు చూస్తున్నట్లు క్యూ లైన్లలో అతడి సమాధి సందర్శన కోసం ఎదురు చూస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పునీత్‌కు ఇలా జరక్కపోయి ఉంటే బాగుండేదని ఇప్పటికీ వారిలో బాధ వ్యక్తమవుతోంది. పునీత్ ఎందుకు చనిపోయాడో.. అతడికి సత్వరం వైద్యం అందలేదా.. వైద్యులు ఎలా స్పందించారు.. అనే విషయాలను శోధించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.

కాగా వ్యాయామం చేస్తున్న సమయంలో అస్వస్థతకు గురి కావడం.. వెంటనే సమీపంలో ఉన్న ఫ్యామిలీ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లడం.. అతణ్ని పరీక్షించిన ఫ్యామిలీ డాక్టర్.. పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్లమని సూచించడం.. అతణ్ని విక్రమ్ హాస్పిటల్‌‌కు తరలించగా ఆలోపే అతడికి గుండెపోటు వచ్చి అపస్మారక స్థితికి చేరడం.. వైద్యులు ఎంత ప్రయత్నించినా అతణ్ని కాపాడలేకపోవడం.. ప్రాణాలు కోల్పోవడం తెలిసిందే.

ఐతే పునీత్‌కు చికిత్స అందించే విషయంలో వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ కొందరు అభిమానులు సోషల్ మీడియాలో వీడియోలు పెడుతుండటం.. వైద్యుల పట్ల ఆగ్రహం వ్యక్తం చే్స్తుండటంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. పునీత్ ఫ్యామిలీ డాక్టర్‌తో పాటు విక్రమ్ హాస్పిటల్ వైద్యులకు సైతం పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు సమాచారం. ఈ విపత్కర పరిస్థితుల్లో అభిమానులు ఎలా స్పందిస్తారో తెలియని పరిస్థితుల్లో ముందు జాగ్రత్తగానే పోలీసులు ఈ చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది.