హన్సిక సింగిల్ షాట్ కష్టాలు

ఒకప్పుడు టాప్ హీరోయిన్స్‌లో ఒకరుగా వెలిగింది హన్సిక. ప్రామిసింగ్‌ హీరోలతో నటిస్తూ మంచి విజయాలను కూడా ఖాతాలో వేసుకుంది. కానీ ఉన్నట్టుండి ఆమె కెరీర్ గ్రాఫ్ పడిపోయింది. పెద్ద హీరోల పక్కన అవకాశాలు తగ్గాయి. ప్రస్తుతం ఆమె చేస్తున్న సినిమాలు చూస్తే అప్పటి హన్సికేనా ఈమె అనిపిస్తోంది.

ప్రస్తుతం మహా, పార్ట్‌నర్, 105 మినిట్స్, మై నేమ్ ఈజ్ శ్రుతి, రౌడీ బేబీ లాంటి చిత్రాల్లో నటిస్తోంది హన్సిక. వీటిలో ఒకట్రెండు తప్ప చెప్పుకోదగ్గ బ్యానర్‌‌ కానీ, ప్రాజెక్ట్‌పై అంచనాలను పెంచే టీమ్ ఉన్న సినిమాలు కానీ లేవు. పోనీ కాన్సెప్ట్‌ కొత్తగా ఉండి, కొత్తవారైనా బాగా తీస్తారనే నమ్మకంతో హన్సిక ఒప్పుకుందా అనకుందామంటే.. దీపావళి సందర్భంగా రిలీజైన ‘105 మినిట్స్’ గ్లింప్స్‌ మనల్ని అలా అనుకోనివ్వదు.

రాజు దుస్సా డైరెక్షన్‌లో బొమ్మక్ శివ నిర్మిస్తున్న ఈ సినిమాని సింగిల్ షాట్‌లో తీసేశారు. మూవీ మొత్తంలో ఒకే ఒక్క క్యారెక్టర్ ఉంటుంది. అంటే హన్సిక తప్ప ఇక ఎవరూ కనిపించరు. ఇలా సింగిల్ క్యారెక్టర్‌‌తో వచ్చే సినిమాల్లో ఏం జరుగుతుందో తెలిసిందే. ఆ క్యారెక్టర్‌‌ ఎక్కడో బందీ అయిపోతుంది. తనని ఎవరైనా వ్యక్తి కానీ, ఏదైనా శక్తి కానీ భయపెడుతూ ఉంటుంది. ఆ విచిత్రమైన పరిస్థితుల్ని ఆ క్యారెక్టర్ ఎలా ఎదుర్కొంటుంది అనేదాని చుట్టూనే సినిమా నడుస్తుంది.

హన్సిక సినిమాలో కూడా అదే కనిపిస్తోంది. చివర్లో ఏదైనా ట్విస్ట్ ఉంటుందేమో తెలీదు కానీ.. గ్లింప్స్‌లో చూపించినంత వరకు కనిపిస్తోంది మాత్రం ఇదే. పైగా షాట్స్‌ కూడా అంత కొత్తగా ఏమీ లేవు. అన్నీ ఏదో ఒక సినిమాలో చూసినట్టుగానే కనిపిస్తున్నాయి. హన్సిక కష్టాలు చూస్తుంటే.. ‘కౌన్‌ హై’ సినిమాలో ఊర్మిళ, రాగిణి ఎమ్మెమ్మెస్‌లో హీరో హీరోయిన్ల ఎక్స్‌పీరియెన్సెస్ గుర్తొస్తున్నాయి. కాకపోతే హన్సిక యాక్సెప్ట్ చేసింది కాబట్టి స్టోరీలో ఏదైనా ట్విస్ట్ ఉండొచ్చని ఊహించవచ్చు. అదేంటో సినిమా చూసి తెలుసుకోవాల్సిందే మరి.