మెగాస్టార్ తో మారుతి కామెడీ సినిమా!

చిన్న దర్శకుడిగా కెరీర్ మొదలుపెట్టిన దర్శకుడు మారుతి ఇప్పుడు టాప్ లీగ్ లోకి చేరిపోయాడు. ‘భలే భలే మగాడివోయ్’, ‘మహానుభావుడు’, ‘ప్రతిరోజు పండగే’ లాంటి సినిమాలు దర్శకుడిగా మారుతికి మంచి పేరుని తీసుకొచ్చాయి. ఆయన కెరీర్ లో ఎన్ని హిట్స్ ఉన్నప్పటికీ.. ఒక స్టార్ హీరోని డైరెక్ట్ చేసే ఛాన్స్ మాత్రం రాలేదు. అలాంటిది ఇప్పడు ఏకంగా చిరంజీవితోనే సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడని సమాచారం.

నిజానికి మారుతి-చిరంజీవి కాంబినేషన్ లో సినిమా రాబోతుందని గతంలో వార్తలొచ్చాయి. కానీ ఆ తరువాత ఎలాంటి అప్డేట్ రాలేదు. తాజాగా ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు మారుతి. ఇటీవల చిరంజీవి గారిని కలిసి ఓ లైన్ చెప్పానని.. ఆయనకు బాగా నచ్చిందని అన్నారు. ఇప్పుడు దాన్ని డెవలప్ చేసే పనిలో పడ్డానని.. తన మార్క్ కామెడీతో పాటు, చిరు ఫ్యాన్స్ ఆశించే అన్ని ఎలిమెంట్స్ సినిమాలో ఉంటాయని చెప్పుకొచ్చారు.

మెగాస్టార్ తో సినిమా అయితే పక్కా అని చెబుతున్నారు మారుతి. కానీ ప్రస్తుతం చిరు చాలా బిజీగా గడుపుతున్నారు. ‘గాడ్ ఫాదర్’ సినిమాను పూర్తి చేస్తోన్న ఆయన త్వరలోనే బాబీ, మెహర్ రమేష్ దర్శకత్వంలో సినిమాలు చేయబోతున్నారు. ఆ తరువాత మారుతికి ఛాన్స్ ఇస్తారేమో చూడాలి. ఈలోగా మారుతి రెండు సినిమాలు ఈజీగా చేసేసుకోవచ్చు. ప్రస్తుతం మారుతి డైరెక్ట్ చేసిన ‘మంచి రోజులు వచ్చాయి’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. అలానే గోపీచంద్ హీరోగా ‘పక్కా కమర్షియల్’ సినిమా లైన్లో ఉంది.