శ్రీలీలకు మరో ఛాన్స్!

‘పెళ్లి సందD’ సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన శ్రీలీల. ఈ సినిమా పెద్దగా సక్సెస్ అవ్వనప్పటికీ.. శ్రీలీల అందానికి యూత్ ఫిదా అయిపోయింది. ఆమె హావభావాలు దర్శకనిర్మాతలను ఆకట్టుకున్నాయి. పైగా ఇండస్ట్రీలో హీరోయిన్ల కొరత ఉండడంతో అందరి దృష్టి శ్రీలీలపై పడింది. దీంతో ఆమెకి వరుస అవకాశాలు వస్తున్నాయి. మొదటి సినిమా రిలీజ్ కాకముందే రవితేజ సినిమాలో హీరోయిన్ గా తీసుకున్నారు. ఇప్పుడు రెండో సినిమాపై అఫీషియల్ గా సైన్ చేసిందని సమాచారం.

దిల్ రాజు సోదరుడి కుమారుడు ఆశిష్ రెడ్డి చేయబోయే రెండో సినిమాకి శ్రీలీలను హీరోయిన్ గా ఫైనల్ గా చేసుకున్నారు. ఈ సినిమాను దిల్ రాజు బ్యానర్ మీదే చేస్తారని సమాచారం. ఇక ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా మిక్కీ జె మేయర్ ను తీసుకున్నారట. దిల్ రాజు నిర్మించిన చాలా సినిమాలకు మిక్కీ జె మేయర్ సంగీతం అందించారు. రైటర్ గా చంద్రబోస్ ను తీసుకున్నారు.

ఇక ఈ సినిమాను ఎవరు డైరెక్ట్ చేయబోతున్నారనే విషయం బయటకు రాలేదు. ప్రస్తుతానికైతే.. హీరో-హీరోయిన్-మ్యూజిక్ డైరెక్టర్ లను ఫైనల్ చేసుకున్నారు. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన అధికార ప్రకటన రానుంది. మొత్తానికి శ్రీలీల దిల్ రాజు బ్యానర్ లో ఆఫర్ కొట్టేసింది. దీంతో పాటు ఆమె చేతిలో మరో నాలుగైదు సినిమాలు ఉన్నాయని సమాచారం. మరి ఈ సినిమాలతో ఆమె ఎలాంటి విజయాలను అందుకుంటుందో చూడాలి!