సమంత.. మళ్లీ పాత రోజుల్లోకి?

నాలుగేళ్ల కిందట నాగచైతన్యను పెళ్లి చేసుకున్నపుడు ఇకపై సినిమాలు చేయదేమో అని సందేహించారు చాలామంది. కానీ ఆమె సినిమాలేమీ మానేయలేదు. పెళ్లయిన కొత్తలో రామ్ చరణ్, విశాల్ లాంటి హీరోలకు జోడీగా మామూలుగానే సినిమాలు చేసుకుపోయింది. ఐతే పెళ్లికి ముందే కమిటైన చిత్రాలు కావడం వల్లో ఏమో.. తర్వాత తర్వాత మాత్రం వేరే హీరోలతో రొమాన్స్ చేయడానికి సమంత అంతగా ఆసక్తి చూపించలేదు. చాలా వరకు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు, హీరోల పక్కన ఆడి పాడాల్సిన, రొమాన్స్ చేయాల్సిన అవసరం లేని చిత్రాలకు పరిమితం అయింది.

ఒక దశలో ఆమె సినిమాలు కూడా తగ్గిపోయాయి. ఇక నెమ్మదిగా సినిమాలకు టాటా చెప్పేసి వ్యక్తిగత జీవితంలో స్థిరపడిపోతుందేమో అన్న డౌట్లు కూడా కలిగాయి. కానీ ఇంతలో అనుకోని విషయాలు జరిగిపోయాయి. నాగచైతన్య నుంచి సమంత విడిపోయింది.

ఈ పరిణామంతో సమంత డిస్టర్బ్ అయ్యిందనే సంకేతాలు కూడా కనిపించాయి. ఐతే ఈ బాధ నుంచి బయటపడటానికి సినిమాలే మార్గం అన్న అభిప్రాయానికి సమంత వచ్చినట్లుగా కనిపిస్తోంది. వరుసగా ఆమె సినిమాలు కమిటవుతుండటమే అందుకు రుజువు. తమిళ:లో విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సామ్.. సీనియర్ ప్రొడ్యూసర్ శివలెంక కృష్ణప్రసాద్ నిర్మాణంలో ఓ కొత్త దర్శకుడి సినిమాలోనూ నటించనున్న సంగతి తెలిసిందే. సామ్ ప్రధాన పాత్రలో మరో లేడీ ఓరియెంటెడ్ మూవీని కూడా ప్రకటించబోతున్నట్లు వార్తలొస్తున్నాయి.

కాగా ఇప్పుడు సామ్.. నానికి జోడీగా కనిపించబోతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. నేచురల్ స్టార్ హీరోగా ‘దసరా’ పేరుతో కొత్త సినిమాను ప్రకటించిన సంగతి తెలిసిందే. అందులో పక్కా తెలంగాణ అమ్మాయిగా సమంత నటించనుందట. మధ్యలో పెట్టుకున్న షరతులన్నీ పక్కన పెట్టేసి.. ఇందులో నానితో ఒక కమర్షియల్ హీరోయిన్ తరహాలోనే రొమాన్స్ కూడా చేయబోతోందట. ఈ సినిమాలో ఒకప్పటి స్టయిల్లో కనిపించి తనను అన్ని రకాల సినిమాలకూ దర్శక నిర్మాతలు పరిగణించేలా సమంత చేయబోతోందని అంటున్నారు.