బెయిల్ దొరికింది కానీ..

డ్రగ్స్‌ కేసులో అరెస్టైన షారుఖ్ ఖాన్‌ కొడుకు ఆర్యన్‌.. దాదాపు నాలుగు వారాలు జైలు గోడల మధ్య గడిపాడు. తనని బైటికి తీసుకు రావడానికి షారుఖ్ దంపతులు చేసిన ప్రయత్నాలు చాలాసార్లు బెడిసికొట్టాయి. ఎట్టకేలకి ఇప్పటికి బెయిల్ దొరికింది. అయితే బెయిల్ దొరికినా ఆర్యన్‌కి ఇప్పుడప్పుడే స్వేచ్ఛ మాత్రం దొరికే చాన్స్ లేదు. ఎందుకంటే కట్టుదిట్టమైన పద్నాలుగు ఆంక్షలతో అతనికి బెయిల్ ఇవ్వడం జరిగింది.

లక్షరూపాయలతో పాటు ఇద్దరు ప్రముఖ వ్యక్తుల పూచీకత్తు మీద ఇచ్చిన ఈ బెయిల్‌లో ఉన్న నియమాలు ఏంటంటే.. ప్రత్యేక కోర్టు అనుమతి లేకుండా ఆర్యన్ దేశం వదిలి వెళ్లడానికి వీల్లేదు. తన పాస్‌పోర్టును సరెండర్ చేసేయాలి. చివరికి ముంబై దాటి బైటికి వెళ్లాలన్నా దర్యాప్తు అధికారి అనుమతి కావాలి. బైటికి వెళ్తున్నానని చెబితే సరిపోదు, ఎక్కడికి వెళ్తున్నాడో ఎందుకు వెళ్తున్నాడో కూడా వివరంగా చెప్పాలి. కేసు విచారణను అడ్డుకునే ఎలాంటి ప్రయత్నాలు చేయకూడదు. సాక్ష్యుల్ని, ఆధారాల్ని ప్రభావితం చేయకూడదు.

అలాగే నిందితుల్లో ఒకడైన తన ఫ్రెండ్‌ అర్బాజ్ మర్చంట్‌తో పాటు మరే నిందితుడితోనూ మాట్లాడటానికి వీల్లేదు. కేసు గురించి మీడియాతో మాట్లాడటానికి కూడా వీల్లేదు. ఎన్‌సీబీ అధికారులు ఎప్పుడు పిలిచినా రావాలి. ప్రతి శుక్రవారం పదకొండు నుంచి రెండు గంటల మధ్య ఎన్‌సీబీ ఆఫీసులో కచ్చితంగా హాజరవ్వాలి. ఒక్కటి కూడా మిస్సవకుండా ప్రతి కోర్టు విచారణకీ హాజరవ్వాలి. విచారణ ఆలస్యమయ్యేలా ఎలాంటి ప్లాన్లూ వేయకూడదు. అన్నిటింకంటే ముఖ్యంగా తను డ్రగ్స్‌కి పూర్తి దూరంగా ఉండాలి.

ఈ కండిషన్స్ అన్నీ సరిగ్గా ఫాలో అయితేనే ఆర్యన్ బైట ఉంటాడు. దేన్ని మీరినా మళ్లీ అరెస్ట్ చేసే అధికారం ఎన్‌సీబీకి ఉంటుంది. ఇక షారుఖ్ కూడా కొడుకు విషయంలో కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. కొన్నాళ్ల పాటు ఆర్యన్ బైటికి రాడని, తనని కదిలించే ప్రయత్నం చేయవద్దని ఆల్రెడీ సన్నిహితులు, బంధువులదరికీ చెప్పేశాడట. ఆర్యన్‌ని డ్రగ్స్‌కి దూరం చేసేందుకు ఇంట్లోనే కౌన్సెలింగులవీ ఇప్పించబోతున్నట్లు తెలుస్తోంది. మరి ఆ చెడు అలవాటు నుంచి, ఈ కేసు నుంచి ఆర్యన్‌ ఎప్పటికి బయటపడతాడో చూడాలి.