ఇదేం ట్రైలరండీ బాబూ

బాలీవుడ్లో పక్కా యాక్షన్ సినిమాలు చేసే హీరోల్లో జాన్ అబ్రహాం ఒకడు. మంచి బాడీ బిల్డర్ అయిన జాన్.. అందుకు తగ్గ మాస్ పాత్రలను ఎంచుకుని, వీర లెవెల్లో యాక్షన్ పండిస్తుంటాడు తన సినిమాల్లో. ‘ధూమ్’ మొదలుకుని.. ‘సత్యమేవ జయతే’ వరకు అతడి సినిమాలు చాలా వరకు యాక్షన్ ప్రధానంగానే నడిచాయి. ఇప్పుడు జాన్ అబ్రహాం నుంచి రాబోతున్న ‘సత్యమేవ జయతే-2’ కూడా ఆ బాటలోనే సాగుతుందని.. ఇంతకుముందు రిలీజ్ చేసిన ప్రోమోలతోనే అర్థమైంది. ఇప్పుడు ఈ సినిమా ట్రైలర్ లాంచ్ చేశారు.

ఐతే మూడు నిమిషాలకు పైగా సాగిన ఈ ట్రైలర్లో విపరీతమైన యాక్షన్.. అవసరం లేని అరుపులు.. మాస్‌ను టార్గెట్ చేసిన డైలాగులు తప్ప.. ఇంకే ఆకర్షణలూ కనిపించలేదు. ఎంతసేపూ జాన్ అబ్రహాం బాడీని ఎలివేట్ చేస్తూ యాక్షన్ విన్యాసాలు చేయించారే తప్ప.. కొత్తగా ప్రేక్షకులకు ఆఫర్ చేసేది ఏమీ లేదనిపిస్తోంది ట్రైలర్ చూస్తే. జాన్ తన కెరీర్లోనే తొలిసారిగా ఈ చిత్రం కోసం ట్రిపుల్ రోల్ చేశాడు. అందులో ఒకటి రౌడీ పాత్ర అయితే.. ఇంకోటి పోలీస్ క్యారెక్టర్. మూడోది రాజకీయ నాయకుడి పాత్ర.

రౌడీ పాత్రను కట్టడి చేయడం కోసం పోలీస్ క్యారెక్టర్ ట్రై చేస్తే.. వీళ్లిద్దరూ ఘర్షణ పడటం వల్ల వేరే వాళ్లకు మేలు జరుగుతోందని చెప్పి.. వీళ్లిద్దరినీ కలిపి విలన్ల మీదికి దండయాత్ర చేయించే పాత్రలో పొలిటికల్ లీడర్ పాత్ర కనిపించనుంది. జాన్ సినిమాల్లో అతను బాడీ చూపిస్తూ యాక్షన్ విన్యాసాలు చేయడం కొత్తేమీ కాదు. ఇందులోనూ అదే చేశాడు. ఒక సీన్లో అయితే మోటార్ సైకిల్ మీద వెళ్తున్న రౌడీని ఆ మోటార్ సైకిల్‌తో సహా అలా పైకెత్తి విసిరేయడం కనిపించింది. ఇది చూసి మరీ ఇంత అతి అవసరమా అని నెటిజన్లు కౌంటర్లు వేస్తున్నారు.

ట్రైలర్లో డైలాగ్స్, యాక్షన్ అంతా కూడా ఓవర్ ద టాప్ అన్నట్లే కనిపించింది. మాస్‌ను టార్గెట్ చేసిన సగటు సినిమాలా కనిపిస్తున్న ‘సత్యమేవ జయతే-2’ పట్ల ప్రేక్షకుల్లో ఇప్పటికైతే పెద్దగా ఆసక్తి కలగడం కష్టమే. నవంబరు 26న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అదే రోజు సల్మాన్ ఖాన్ మూవీ ‘అంతిమ్’ కూడా రిలీజ్ కానుంది.