‘జెర్సీ’ దర్శకుడితో రామ్ చరణ్ సినిమా

ఒకప్పుడు స్టార్ హీరోలు ఒక సినిమా పూర్తయ్యాకే మరో సినిమాకి కమిటయ్యేవారు. కానీ ఇప్పుడు ఒక మూవీ సెట్స్‌పై ఉండగానే నెక్స్ట్ చేయడానికి ఒకట్రెండు ప్రాజెక్టుల్ని సెట్ చేసి పెట్టేసుకుంటున్నారు. రామ్‌ చరణ్ కూడా ఇప్పుడు అదే చేశాడు.

‘ఆర్ఆర్ఆర్‌‌’ మూవీ చివరి దశకు వచ్చేవరకు రామ్ చరణ్ తన నెక్స్ట్ ప్రాజెక్టు వివరాలేవీ బైటికి చెప్పలేదు. కానీ సడెన్‌గా శంకర్‌‌తో సినిమాని అనౌన్స్ చేసి సర్‌‌ప్రైజ్ చేశాడు. ఆ సినిమా ఇంకా సెట్స్‌కి వెళ్లకముందే దసరా సందర్భంగా గౌతమ్ తిన్ననూరితో మూవీ ప్రకటించి స్వీట్ న్యూస్ చెప్పాడు. ఈ చిత్రాన్ని యువీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది.

‘మళ్లీరావా’తో ప్రేమలోని ఎమోషన్‌ని హార్ట్ టచింగ్‌గా చెప్పిన గౌతమ్ తిన్ననూరి.. ‘జెర్సీ’ చిత్రంతో హ్యూమన్ లైఫ్‌లోని అన్ని ఎమోషన్స్‌ని ఎంత బాగా ఆవిష్కరించగలడో ప్రూవ్ చేసుకున్నాడు. ప్రస్తుతం అదే సినిమాని హిందీలోకి రీమేక్ చేస్తున్నాడు. ఇక ‘రంగస్థలం’తో తనలోని ఎమోషనల్ కోణాన్ని బయటికి తీశాడు రామ్ చరణ్. వీరిద్దరూ కలిస్తే ఓ అద్భుతమైన ఎమోషనల్ డ్రామా ప్రేక్షకుల ముందుకు రావడం ఖాయం. కాకపోతే గౌతమ్ ఈసారి కూడా అదే జానర్‌‌ని ఎంచుకున్నాడో లేక చెర్రీ కోసం ఏదైనా కొత్త కాన్సెప్ట్ ప్లాన్ చేశాడో చూడాలి.