మహాసముద్రం.. సమంత చేసుంటే?


దసరా కానుకగా ఈ గురువారం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ‘మహాసముద్రం’. ఈ సినిమా కథను దర్శకుడు అజయ్ భూపతి తన తొలి చిత్రం ‘ఆర్ఎక్స్ 100’ కంటే ముందే రాసుకున్నాడట. ‘ఆర్ఎక్స్ 100’ బ్లాక్‌బస్టర్ కావడంతో వెంటనే ఈ సినిమానే తెరకెక్కించాలనుకున్నాడు. కానీ దీనికి తగ్గ కాస్టింగ్ కుదరకపోవడం వల్ల సినిమా ఆలస్యమైంది.

ముఖ్యంగా ఈ సినిమాలో ఒక కథానాయకుడిగా ముందు సిద్దార్థ్‌ను ఫిక్స్ చేసుకోవడంతో అతడితో కలిసి మల్టీస్టారర్ చేయడానికి కొందరు హీరోలు ముందుకు రాలేదన్నది దర్శకుడు అజయ్ భూపతి చెప్పిన మాట. చివరికి శర్వానంద్ ఓకే చెప్పడంతో ఈ సినిమా పట్టాలెక్కింది. ఇక ఈ సినిమాలో ఓ కథానాయికగా అదితి రావును చాలా ముందుగానే ఖరారు చేసుకున్నాడు అజయ్. సినిమా మొదలు కావడంలో ఆలస్యమైనప్పటికీ ఆమెతోనే ఈ పాత్ర చేయించాలని పట్టుబట్టి కూర్చున్నట్లు కూడా అజయ్ చెప్పడం తెలిసిందే.

ఐతే అదితి చేసిన మహా పాత్రకు కూడా ముందు అనుకున్నది ఆమెను కాదట. సమంతకు ఈ కథ చెప్పగా.. ఆమెకు బాగా నచ్చిందని.. ఆమెకు ఈ పాత్ర బాగానే సూటయ్యేదని.. కొన్ని కారణాల వల్ల ఆమె ఈ సినిమా చేయలేకపోయిందని అజయ్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించాడు. ఐతే కథానాయికకు మంచి ప్రాధాన్యమున్నట్లుగా కనిపిస్తున్న ఈ సినిమాను సమంత ఎందుకు చేయలేకపోయిందన్నది ఆసక్తికరం.

బహుశా అప్పటికే ఈ సినిమాలో ఓ హీరోగా సిద్ధు ఫిక్స్ అయి ఉండటం వల్ల.. అతడితో ఒకప్పటి బంధాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ సినిమాను సమంత ఒప్పుకోక పోయి ఉండొచ్చని భావించవచ్చు. కెరీర్ ఆరంభంలో సిద్ధుతో సమంత కొంతకాలం రిలేషన్‌షిప్‌లో ఉండటం, తర్వాత ఇద్దరి మధ్య విభేదాలు వచ్చి విడిపోవడం తెలిసిందే. ఇటీవల నాగచైతన్య నుంచి సమంత విడాకులు తీసుకోబోతున్నపుడు సమంతను ఉద్దేశించినట్లుగా సిద్ధు చేసిన ఒక ట్వీట్ వైరల్ కావడం తెలిసిందే.