బాలీవుడ్ లో రేసిజం.. నవాజుద్దీన్ సంచలన వ్యాఖ్యలు..

సినిమా ఇండస్ట్రీలో నెపోటిజం ఉందంటూ చాలా మంది నటీనటులు ఆరోపణలు చేశారు. ఈ విషయంపై కంగనా గ్యాప్ లేకుండా మాట్లాడుతూ ఉంటుంది. బాలీవుడ్ తో పాటు అన్ని ఇండస్ట్రీలలో నెపోటిజం ఉందని చర్చలు జరుగుతున్నాయి. దీని కారణంగా టాలెంట్ ఉన్నవాళ్లకు అవకాశాలు రావడం లేదనేది వాదన. సుశాంత్ రాజ్ పుత్ సింగ్ ఆత్మహత్యకు కారణం కూడా ఇండస్ట్రీలో ఉన్న నెపోటిజం అని అంటుంటారు. అయితే ఇండస్ట్రీలో నెపోటిజం కంటే రేసిజం ఎక్కువ ఉందని అంటున్నారు నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ.

బాలీవుడ్ కు చెందిన ఈ నటుడు తన విలక్షణ పాత్రలో అందరికీ దగ్గరయ్యారు. ‘సేక్రెడ్ గేమ్స్’ వెబ్ సిరీస్ తో నవాజుద్దీన్ ఫాలోయింగ్ మరింత పెరిగింది. తాజాగా ఆయన ఇండస్ట్రీలో రేసిజంపై చేసిన సంచలన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. రీసెంట్ గా ఆయన నటించిన ‘సీరియస్ మ్యాన్’ అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో ఇందిరా తివారి హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాలో ఇందిరాను హీరోయిన్ గా తీసుకోవడం గొప్ప విషయమని అన్నారు నవాజుద్దీన్.

దానికి కారణం ఆమె నల్లగా, పొట్టిగా ఉంటుందని. ఈ సినిమా తరువాత ఇందిరాకు మరో ఆఫర్ వస్తే అదే గొప్ప విజయమని అన్నారు. బాలీవుడ్‌లో తెల్లగా ఉండేవాళ్లతో పాటు నల్లగా ఉండేవారు కూడా హీరోయిన్లుగా చేయాలని కోరుకున్నారు. నల్లగా ఉన్నప్పటికీ.. అద్భుతంగా నటించేవాళ్లు చాలా మంది ఉన్నారని.. కానీ ఇండస్ట్రీలో ఉన్న రేసిజం వలన ఎంతో మంది గ్రేట్‌ యాక్టర్స్‌ బలైపోయారని చెప్పారు. ఈ సమస్యపై చాలా కాలంగా పోరాటం చేస్తున్నానని నవాజుద్దీన్ చెప్పుకొచ్చారు.