‘కొండపొలం’ షూటింగ్ కష్టాలు అన్నీ ఇన్నీ కావు

రెండున్నర గంటల పాటు వెండితెర మీద కనిపించే పాత్రలు.. వాటి మధ్య నడిచే సంఘర్షణ.. భావోద్వేగం.. ప్రేక్షకుడిని కట్టిపడేస్తాయి. వారిని వేరే లోకాలకు తీసుకెళతాయి. తెలీని తన్మయత్వాన్ని కలిగిస్తాయి. అదే సినిమా మేజిక్. ఈ కారణంతోనే సినిమాలకు అలవాటు పడిన వారు… రెండున్నర గంటల సమయం గురించి ఆలోచించరు. దానిని ఆస్వాదిస్తారు. తెర మీద కనిపించే పాత్రలతో థియేటర్ సీట్లో కూర్చున్న వాడు మాట్లాడుకుంటూ ఉంటాడు. అలా ప్రేక్షుకుడితో మాట్లాడిన సినిమాలు హిట్టవుతుంటాయి. ప్రేక్షకులతో కనెక్ట్ కానివి పోతుంటాయి.

అన్ని సినిమాలు ఒకలా ఉండవు. అందరూ దర్శకులు ఒకేలా ఉండరు. ఎవరికి వారు.. వారి కంటూ ఒక ప్రత్యేకత ఉంటుంది. టాలీవుడ్ దర్శకుల్లో క్రిష్.. అలియాస్ క్రిష్ జాగర్లమూడిది ప్రత్యేకమైన కోణం. కొత్తదనాన్ని.. సినిమాకు చూపించటం ద్వారా ప్రేక్షకుల్ని కట్టి పారేయటమే కాదు.. తన తర్వాతి సినిమా ఏమిటన్న దానిపై ఆసక్తిగా ఎదురు చూసేలా చేయటంలో ఆయన టాలెంట్ కాస్త భిన్నమని చెప్పాలి.

తాజాగా ఆయన తీసిన కొండపొలం మూవీకి సంబంధించిన కష్టం తెలిసినప్పుడు.. నిజంగా ఇంత కష్టపడ్డారా? అనుకోకుండా ఉండలేం. కరోనా పూర్తిగా పోని వేళ.. భయం భయంతో.. పరిమితమైన క్రూతో చేసిన ఈ సినిమా షూటింగ్ రోటీన్ తరహా కాదు. ఎందుకంటే.. సినిమాలో ప్రధానమైన భాగమంతా గొర్రెలతో షూట్ చేయాల్సి ఉంటుంది. మనుషులు అయితే చెప్తే వింటారు. మరి జీవులు అంత సులువుగా వినవు కదా. దాదాపు వెయ్యికి పైగా గొర్రెల్ని తీసుకొని.. వాటిని కంట్రోల్ చేస్తూ.. తమకు ఓకే అయ్యేటట్లు షూటింగ్ చేయటం అంత తేలికైన విషయం కాదు.

వెయ్యి గొర్రెలతో షూటింగ్ చేసేసరికి తలప్రాణం తోకకు వచ్చిందని.. నలభై రోజుల పాటు తామే ఆ గొర్రెలకు కాపరులుగా మారామని చెప్పారు. ‘కరోనా వేళ మాస్కులు వేసుకుంటూ.. టెంపరేచర్ చెక్ చేసుకుంటూ షూటింగ్ చేయటం చాలా కష్టమనిపించింది అని చెప్పారు. అడవుల్లో షూటింగ్ చేయటానికి కనీసం 200 మంది అవసరమవుతారు. కానీ.. మా టీం మాత్రం 80 మంది మాత్రమే. అంత తక్కువ మందితో క్రేన్లు.. పెద్ద కెమెరాలు.. ఎక్విప్ మెంట్ మోసుకుంటూ కొండలు ఎక్కడానికి చాలా కష్టపడ్డాం’ అంటూ క్రిష్ పడిన శ్రమ వివరించారు.


నిజమే సినిమా సెటప్ మామూలుగా ఉండదు…. నడక దారిలో ఎక్కే ఆ కొండల్లో అదంతా ఎలా సెట్ చేసుకున్నారో, ఆ జీవుల్ని తమకు అనుగుణంగా ఎలా కంట్రోల్ లో పెట్టి సినిమా తీశారో అంతా ఆసక్తికరంగానే ఉంది. ఒంటరిగా ట్రెక్కింగ్ కే ఎంతో కష్టం. ఇది లగేజ్ ట్రెక్కింగ్ అనుకోవాలి.