దిల్ రాజు ఆ సినిమాను ఏం చేశాడు?


టాలీవుడ్లో ప‌క్కా ప్లానింగ్‌తో సినిమాలు చేసే నిర్మాత‌ల్లో దిల్ రాజు ఒక‌రు. ఆ ప్లానింగ్ వ‌ల్లే ఆయ‌న ఎన్నో ఏళ్ల నుంచి టాలీవుడ్ టాప్ ప్రొడ్యూస‌ర్ల‌లో ఒక‌డిగా కొన‌సాగుతున్నాడు. క‌థ ఎంపిక ద‌గ్గ‌ర నుంచి రిలీజ్ వ‌ర‌కు రాజు ప్లానింగ్ చాలా ప‌క్కాగా ఉంటుంద‌ని అంటుంటారు. ఐతే ఓ సినిమా విష‌యంలో ఆయ‌న ప్లానింగ్ దెబ్బ తిన్న‌ట్లు క‌నిపిస్తోంది. వేరే నిర్మాత‌లు మొద‌లుపెట్టిన గుడ్ ల‌క్ స‌ఖి సినిమాను దిల్ రాజు మ‌ధ్య‌లో త‌న చేతుల్లోకి తీసుకున్నాడు.

హైద‌రాబాద్ బ్లూస్, ఇక్బాల్ లాంటి క్లాసిక్స్ తీసిన విల‌క్ష‌ణ ద‌ర్శ‌కుడు న‌గేష్ కుకునూర్ డైరెక్ట్ చేసిన చిత్ర‌మిది. కీర్తి సురేష్ లీడ్ రోల్ చేసిన ఈ సినిమాలో ఆది పినిశెట్టి, జ‌గ‌ప‌తిబాబు కీల‌క పాత్ర‌లు పోషించారు. ఫైనాన్స్ విష‌యంలో దీని నిర్మాత‌లు ఇబ్బంది ప‌డుతున్న టైంలో, కంటెంట్ మీద న‌మ్మ‌కంతో దిల్ రాజు ఈ చిత్రాన్ని టేక‌ప్ చేశారు. ఆయ‌న ఆధ్వ‌ర్యంలోనే సినిమా పూర్త‌యింది కూడా.

ఐతే ఆర్నెల్ల ముందే సినిమా ప‌నంతా పూర్త‌యినా కూడా ఇది విడుద‌ల‌కు మాత్రం నోచుకోలేదు. కీర్తి గ‌త చిత్రాలు పెంగ్విన్, మిస్ ఇండియా సినిమాల మాదిరే ఇది కూడా ఓటీటీ బాట ప‌డుతుంద‌నే సంకేతాలు క‌నిపించాయి. అలా ఏమీ జ‌ర‌గ‌లేదు. సెకండ్ వేవ్ నేప‌థ్యంలో థియేట‌ర్లు తెరుచుకునే వ‌ర‌కు వేచి చూస్తున్నారేమో, బిగ్ స్క్రీన్స్ ఓపెన్ కాగానే ఈ సినిమా రిలీజ‌వుతుంద‌ని అనుకున్నారు కానీ.. థియేట‌ర్లు తెరుచుకుని రెండున్న‌ర నెల‌ల‌వుతున్నా ఈ సినిమా ఊసే వినిపించ‌డం లేదు.

ఏడాది ముందు ఒక టీజ‌ర్ రిలీజ్ చేసి వ‌దిలేశారు. ఆ త‌ర్వాత సినిమా గురించి ఏ అప్‌డేట్ లేదు. ఏ ర‌కంగానూ సినిమాను వార్త‌ల్లో నిలిపే ప్ర‌య‌త్నం చేయ‌లేదు. ఇప్పుడు గుడ్ ల‌క్ స‌ఖి గురించి అంద‌రూ మ‌రిచిపోయారు. ఇలా సినిమా మ‌రుగున ప‌డిపోతుంటే దిల్ రాజు ఏం చేస్తున్నాడు.. ఈ సినిమా రిలీజ్ విష‌యంలో ఆయ‌న ప్ర‌ణాళిక‌లేంటి అన్న‌ది అర్థం కావ‌డం లేదు. మ‌రి గుడ్ ల‌క్ స‌ఖి ఎప్పుడు, ఎలా బ‌య‌టికొస్తుందో చూడాలి.