‘ఆచార్య’ ప్లాన్ మారిందా..?

మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న సినిమా ‘ఆచార్య’. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేశారు. ఇందులో రామ్ చరణ్ కీలకపాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుందా..? అని మెగాభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నిజానికి ఈపాటికే సినిమా విడుదల కావాల్సింది కానీ కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తోంది. మొన్నామధ్య డిస్ట్రిబ్యూటర్లతో చిరంజీవి, కొరటాల శివ మీటింగ్ పెట్టుకొని డిసెంబర్ 17న సినిమాను విడుదల చేయాలని అనుకున్నారు.

దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వస్తుందని భావించారు. కానీ ఈ విషయంలో చిరంజీవి తన ఆలోచన మార్చుకున్నట్లు తెలుస్తోంది. డిసెంబర్ 17న సినిమాను విడుదల చేయడం చాలా మంది డిస్ట్రిబ్యూటర్లకు ఇష్టం లేదట. ఇప్పుడిప్పుడే జనాలు థియేటర్లకు వస్తున్నారు. ఏపీలో ఇంకా యాభై శాతం ఆక్యుపెన్సీతోనే థియేటర్లు నడుపుతున్నారు. ‘ఆర్ఆర్ఆర్’ సినిమా విడుదలై ఈ లెక్కలన్నీ మార్చే అవకాశం ఉందని నమ్ముతున్నారు డిస్ట్రిబ్యూటర్లు. అందుకే ‘ఆర్ఆర్ఆర్’ విడుదలైన తరువాత ‘ఆచార్య’ సినిమాను విడుదల చేస్తే అడ్వాంటేజ్ ఉంటుందని సలహాలు ఇస్తున్నారు.

అలానే రామ్ చరణ్ నటించిన రెండు సినిమాలు మూడు వారాల గ్యాప్ లో విడుదలవ్వడం మంచిది కాదని అంటున్నారు. ఈ ఫీడ్ బ్యాక్ తో చిరంజీవి తన సినిమాను వాయిదా వేయాలని భావిస్తున్నారట. త్వరలోనే కొత్త రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసి ప్రకటించాలని చూస్తున్నారు. జనవరిలో అయితే పోటీగా చాలా సినిమాలు ఉన్నాయి. మరి ‘ఆచార్య’కు ఏ డేట్ దొరుకుతుందో చూడాలి. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమాలో కాజల్ హీరోయిన్ గా నటిస్తుండగా.. పూజాహెగ్డే కీలక పాత్రలో కనిపించనుంది.