‘మా’ కోసం ఆరు కోట్లిచ్చేదెవరబ్బా?


మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల్లో అధ్యక్షుడిగా పోటీ చేయబోతున్నట్లు ప్రకటించి.. చివరి క్షణంలో నామినేషన్ ఉపసంహరించుకున్నాడు సీనియర్ నటుడు సీవీఎల్ నరసింహారావు. నామినేషన్ వేసిన కొన్ని గంటల్లోనే ఆయన వెనక్కి తగ్గడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ‘మా’ అధ్యక్ష పదవి కావాలా, ‘మా’ సంక్షేమం కావాలా అని తనకు శ్రీరాముడు కల్లోకి వచ్చి ప్రశ్నించగా.. ‘మా’ సంక్షేమమే కావాలని కోరుకున్నట్లుగా సీవీఎల్ మొన్నటి ప్రెస్ మీట్లో మీడియాకు వెల్లడించడం గమనార్హం.

మరి శ్రీరాముడు కల్లోకి రాత్రి వచ్చాడా పగలొచ్చాడా అని ఒక విలేకరి వ్యంగ్యంగా ప్రశ్నిస్తే.. సీవీఎల్ సీరియస్ అయ్యాడు కూడా. నామినేషన్ వేసిన కొన్ని గంటల్లోనే ఉపసంహరించుకున్నారు.. మరి అప్పటికప్పుడు పగలే శ్రీరాముడు కల్లోకి వచ్చి మీకు వద్దని చెప్పాడా అంటూ విలేకరి రెట్టించి ప్రశ్నిస్తే.. పగలే వచ్చాడంటూ ఆయన తగ్గి మాట్లాడారు. సీవీఎల్ బీజేపీలో ఉన్న నేపథ్యంలో ఇలా శ్రీరాముడి ప్రస్తావన తెచ్చినట్లుగా కనిపిస్తోంది.

ఈ సంగతలా ఉంచితే ‘మా’ సంక్షేమం కోసమే తాను అధ్యక్ష రేసు నుంచి తప్పుకున్నట్లు చెబుతున్న సీవీఎల్.. రాబోయే ఎన్నికల్లో ఎవరు గెలిచినా ‘మా’ భవనం కోసం రూ.6 కోట్లు ఇవ్వడానికి ఒక వ్యక్తి సిద్ధంగా ఉన్నట్లుగా చెబుతుండటం విశేషం. ఆ వ్యక్తి ఎవరనేది ఎన్నికల అయిన తర్వాత నూతన అధ్యక్షుడి ప్రమాణ స్వీకారం రోజున చెబుతానని అన్నారు. అలాగే ‘మా’ నుంచి పెన్షన్ తీసుకుంటున్న సభ్యులకు ప్రస్తుతం నెలకు రూ.6వేలు ఇస్తుండగా మరో రూ.4 వేలు కలిపి రూ.10 వేల చొప్పున రెండేళ్ల పాటు ఇవ్వడానికి కొందరు వ్యక్తులు ఒప్పుకొన్నారని.. వాళ్లెవరూ ‘మా’ సభ్యులు కాదని.. నటులను అభిమానించే వారని సీవీఎల్ అంటున్నారు.

తాను అధ్యక్షుడిని అయితే ఈ రెండు రకాల సాయాలు ‘మా’కు అందజేయాలన్నది ఆ వ్యక్తుల ఉద్దేశమని.. ఐతే ఇప్పుడు తాను ఎన్నికల నుంచి తప్పుకున్నప్పటికీ.. ఎవరు గెలిచినప్పటికీ ఈ సాయాలు ‘మా’కు అందేలా చూస్తానని సీవీఎల్ చెప్పడం విశేషం. మరి సీవీఎల్ ‘మా’ కోసం ఏకంగా ఆరు కోట్లిచ్చే ఆ వ్యక్తి ఎవరన్నది ఆసక్తికరం.