రాఘవేంద్రరావు హీరోగా మరో సినిమా!

దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుకి టాలీవుడ్ లో ఉన్న ఫాలోయింగ్ గురించి తెలిసిందే. దాదాపు ఒకప్పటి అగ్రహీరోలందరితో కలిసి సినిమాలు తీసిన ఆయన ఈ మధ్యకాలంలో నటనపై దృష్టి పెట్టారు. ఈ క్రమంలో ‘పెళ్లి సందD’ సినిమాలో కీలకపాత్ర పోషిస్తున్నారు. వశిష్ట అనే పాత్రతో ఆయన ప్రేక్షకులను అలరించబోతున్నారు. ఈ సినిమా కాకుండా రాఘవేంద్రరావు ప్రధాన పాత్రలో ఓ సినిమా తెరకెక్కనుంది. దానికి తనికెళ్ల భరణి దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమా స్క్రిప్ట్ కూడా రెడీగా ఉంది. త్వరలోనే షూటింగ్ మొదలుపెడతారు.

ఇందులో నలుగురు హీరోయిన్స్ నటిస్తారని అంటున్నారు. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి మరిన్ని విషయాలు తెలియాల్సివున్నాయి. ఇదిలా ఉండగా.. తాజాగా రాఘవేంద్రరావు మరో సినిమా ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. సీనియర్ దర్శకుడు వి.ఎన్.ఆదిత్య ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నారు. తెలుగులో ఎన్నో హిట్టు సినిమాలు తీసిన వి.ఎన్.ఆదిత్య ఆ తరువాత ‘బాస్’, ‘ఆట’, ‘రాజ్’ లాంటి డిజాస్టర్లు తీయడంతో ఇండస్ట్రీకి దూరమయ్యారు. ఇప్పుడు దర్శకుడిగా మళ్లీ బిజీ అవ్వాలనుకుంటున్నారు.

ఈ క్రమంలో రాఘవేంద్రరావు హీరోగా సినిమా ప్లాన్ చేశారు. కథ సిద్ధంగా ఉంది. ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. అరవై ఏళ్ల వ్యక్తి ప్రేమ కథ బ్యాక్ డ్రాప్ లో సినిమా ఉంటుందని టాక్. తనికెళ్ల భరణి సినిమా పూర్తయ్యాకే ఆదిత్యతో సినిమా మొదలవుతుందని సమాచారం. మొత్తానికి దర్శకుడిగా సినిమాలకు గ్యాప్ ఇచ్చిన రాఘవేంద్రరావు నటుడిగా బిజీ అవుతున్నారు.