చరణ్ లుక్ లో ఎలాంటి మార్పు ఉండదట!

టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా తరువాత రామ్ చరణ్.. దర్శకుడు శంకర్ రూపొందిస్తోన్న ఓ సినిమాలో నటించబోతున్నారు. దీనికి ‘విశ్వంభర’ అనే టైటిల్ అనుకుంటున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా.. ఈ సినిమాలో రామ్ చరణ్ లుక్ ఎలా వుండబోతుందనే విషయం ఆసక్తికరంగా మారింది. నిజానికి శంకర్ తన సినిమాల్లో హీరోలను డిఫరెంట్ గా చూపిస్తుంటారు.

హీరోలను ప్రత్యేకంగా చూపించడం కోసం విదేశాల నుంచి మేకప్ టీమ్ ను రప్పిస్తుంటారు. అంతగా హీరోల గెటప్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. దీంతో చరణ్ ని ఎలా చూపిస్తారో అని అభిమానుల్లో ఎగ్జైట్మెంట్ మొదలైంది. అయితే భారీ అంచనాలు పెట్టుకోవద్దని చెబుతోంది శంకర్ టీమ్. ఎందుకంటే ఈ సినిమాలో చరణ్ సింపుల్ లుక్ తో కనిపిస్తాడట.

ఆయన మీసకట్టుని మాత్రమే మార్చబోతున్నారని సమాచారం. అంతకుమించి చరణ్ గెటప్, లుక్ లో ఎలాంటి మార్పులు ఉండవని చెబుతున్నారు. ఇప్పుడు చరణ్ కనిపిస్తున్న లుక్ తోనే షూటింగ్ మొదలుపెడతారట. ఈ నెలలోనే ఈ క్రేజీ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లబోతుంది. దీనికి సంబంధించి హైదరాబాద్ లో భారీ సెట్ ను నిర్మిస్తున్నారు. కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాలో ముప్పై నిమిషాల నిడివి గల ఓ స్పెషల్ రోల్ ఉందట. దానికోసం మరో స్టార్ ను రంగంలోకి దింపాలని చూస్తున్నారు. మరి ఎవరిని ఫైనల్ చేస్తారో చూడాలి!