కొత్త సినిమా ట్రైలర్ అదిరింది


స్వాతంత్ర్య సమర యోధులు అనగానే మహాత్మా గాంధీ, జవహర్ లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్.. లాంటి ప్రముఖుల పేర్లే గుర్తుకొస్తాయి. వీళ్లు జాతీయ స్థాయిలో విశేషమైన ఆదరణ సంపాదించుకున్నారు. కాంగ్రెస్ పార్టీలో పెద్ద నేతలుగా ఉండటం వల్ల వీరి అప్పుడు, ఇప్పుడు గొప్పగా మాట్లాడుకుంటున్నారు.

ఐతే స్వాతంత్ర్య పోరాటంలో వీరికి దీటుగా పోరాడిన వాళ్లు ఇంకా ఎంతోమంది ఉన్నారు. వారిలో చాలామందికి చరిత్రలో పెద్దగా చోటు దక్కలేదు. తర్వాతి తరాలకు వారి చరిత్రను అందించే ప్రయత్నాలు కూడా పెద్దగా జరగలేదు. ఐతే కొందరు ఫిలిం మేకర్స్ చరిత్ర మరిచిన కొందరు యోధుల చరిత్రను ఈ తరానికి తెలియజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఈ కోవలోని చిత్రమే.. సర్దార్ ఉద్ధమ్. సూర్జిత్ సిర్కార్ దర్శకత్వంలో యువ నటుడు విక్కీ కౌశల్ ప్రధాన పాత్ర పోషించిన చిత్రమిది.

స్వాతంత్ర్యానికి పూర్వం ఇండియాలో జరిగిన అతి పెద్ద విషాదాల్లో జలియన్ వాలాభాగ్ ఉదంతం ఒకటి. శాంతియుతంగా తమ నిరసన తెలిపేందుకు జలియన్ వాలాభాగ్ ప్రాంతంలో గుమిగూడిన వేలాదిమందిపై అప్పటి బ్రిటిష్ అధికారి జనరల్ డయ్యర్ విచక్షణా రహితంగా కాల్పులు జరిపించి వందల మంది ప్రాణాలను పొట్టనబెట్టుకున్న ఘటన గురించి ఇప్పుడు చదివినా హృదయం ద్రవిస్తుంది. ఈ దారుణానికి ప్రతీకారం తీర్చుకోవడం కోసం ఏళ్ల తరబడి ఎదురు చూసి.. లక్ష్య సాధన కోసం ఇంగ్లాండ్‌కు కూడా వెళ్లిన సర్దార్ ఉద్దమ్ సింగ్ కథతో ఈ చిత్రం తెరకెక్కింది.

తాజాగా రిలీజైన ఈ ట్రైలర్ చూస్తే.. ఇదొక ఎపిక్ మూవీ అనిపిస్తోంది. అప్పటి పరిస్థితులను ఉద్వేగభరితంగా చూపిస్తూ ఉద్దమ్ కథను ఉత్కంఠభరితంగా తీర్చిదిద్దినట్లున్నాడు సూర్జిత్ సిర్కార్. ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా అనిపిస్తోంది. ఉద్దమ్ కథేంటో తెలుసుకోవాలన్న క్యూరియాసిటీని పెంచేలా ట్రైలర్‌ను తీర్చిదిద్దారు. విక్కీ కౌశల్ ఈ పాత్రలో అదరగొట్టినట్లే ఉన్నాడు. అమేజాన్ ప్రైమ్ ద్వారా అక్టోబరు 16న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.