నాగ్ కనిపిస్తే సాయిపల్లవి ఛానెల్ మార్చేసేదట

తమిళ అమ్మాయి అయిన సాయిపల్లవికి తెలుగులో రోజు రోజుకూ ఫాలోయింగ్ పెరిగిపోతోంది. ఆమె నటనకు, నృత్యానికి అందరూ ఫిదా అయిపోతున్నారు. అన్నింటికీ మించి ఎంత ఎదిగినా ఉండే ఆమె వ్యక్తిత్వం కూడా అందరికీ నచ్చుతోంది. చాలా సింపుల్‌గా కనిపిస్తూ.. ‘మన’ అనే ఫీలింగ్ కలిగించే ఈ అమ్మాయిని మనవాళ్లు ఎంతగానో ఓన్ చేసుకుంటున్నారు. సాయిపల్లవి ఒక సినిమా చేసిందంటే ఆ సినిమా, తన పాత్ర చాలా ప్రత్యేకంగా ఉంటాయనే భరోసాతో ప్రేక్షకులు థియేటర్లకు వెళ్తున్నారు. ఇలాంటి గుర్తింపు హీరోయిన్లకు రావడం అరుదైన విషయం.

తాజాగా ఆమె ‘లవ్ స్టోరి’తో మరోసారి మన ప్రేక్షకుల మనసులు దోచింది. ఆమె నటన, డ్యాన్స్ చూసి అక్కినేని నాగార్జున కూడా ఫిదా అయిపోయారు. ముఖ్యంగా సాయిపల్లవి డ్యాన్స్ గురించి నాగ్ ‘లవ్ స్టోరి’ సక్సెస్ మీట్లో చేసిన వ్యాఖ్యలు ఆమెకు పెద్ద కాంప్లిమెంట్లే. సాయిపల్లవి డ్యాన్స్ చేస్తుంటే ఒక ఆరా కనిపిస్తుందని.. వంద మంది సాయిపల్లవిలు డ్యాన్స్ చేస్తున్నట్లుంటుందని.. తను నేల మీద ఉన్నా కూడా గాల్లో తేలుతున్న భావన కలిగిస్తుందని నాగ్ అన్నాడు. ఇక సాయిపల్లవి మాట్లాడుతూ.. నాగార్జునతో తనకు చిన్నతనం నుంచే ఒక కనెక్షన్ ఏర్పడిందంటూ.. ఒక ఆసక్తికర విషయాన్ని పంచుకుంది.

తన తాతయ్యకు ‘అన్నమయ్య’ సినిమా అంటే అమితమైన ఇష్టమని.. ఆ చిత్రాన్ని ఆయన వందసార్లు చూశారని.. ఆ వందసార్లూ తనకు, తన చెల్లెలికి కూడా ఆ చిత్రం చూపించారని.. ఆ సినిమా పతాక సన్నివేశంలో అన్నమయ్య వేంకటేశ్వరుడి సన్నిధిలోకి చేరే సన్నివేశాన్ని చూసి ఆయన దండం పెట్టుకుంటూ కన్నీళ్లు పెట్టుకునేవారని.. ఐతే అదంతా నటన అని తాను నవ్వేదాన్నని.. కానీ తన తాతయ్య మాత్రం గత జన్మలో నాగ్ ఒక సన్యాసి అయి ఉంటే తప్ప ఇలా ఈ పాత్రను చేయగలిగేవారు కాదని అనేవారని సాయిపల్లవి వెల్లడించింది.

ఒక నటుడు ఒక పాత్రలో లీనమై నటిస్తే ఎలా ఉంటుందన్నది తనకు తర్వాత అర్థమైందని.. నాగ్ నుంచి ఈ పాఠం నేర్చుకుని ఇప్పుడు తన ప్రతి సినిమాకూ అప్లై చేస్తున్నానని సాయిపల్లవి చెప్పింది. ఇదిలా ఉంటే.. తన తాతయ్య దృష్టిలో నాగ్ నిజంగానే అన్నమయ్య అని.. ఆయనలో అది అలా ముద్ర పడిపోయిందని.. అందుకే నాగ్ నటించిన వేరే సినిమా ఏదైనా టీవీలో వస్తుంటే ఆయన అభిప్రాయం మారకూడదన్న ఉద్దేశంతో ఛానెల్ మార్చేసేదాన్నని సాయిపల్లవి వెల్లడించింది.