పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు సినీ పరిశ్రమలో అత్యంత సన్నిహితులైన వ్యక్తుల్లో ఆలీ ఒకడు. వీళ్లిది రెండు దశాబ్దాల అనుబంధం. పవన్‌తో కలిసి అత్యధిక సినిమాలు చేసిన నటుడు అతనే. వ్యక్తిగతంగా కూడా ఇద్దరి మధ్య గొప్ప అనుబంధం ఉండేది ఒకప్పుడు. ఆ అభిమానం సినీ వేడుకల్లో స్పష్టంగా కనిపించేది. వాళ్ల మధ్య కెమిస్ట్రీనే వేరుగా ఉండేది. ఓ వేడుకలో ఆలీతో తన స్నేహం గురించి పవన్ కూడా మాట్లాడాడు. అతణ్ని వదల్లేకపోతున్నానని చెప్పాడు.
ఇంతటి అనుబంధం ఉన్న ఇద్దరి మధ్య రాజకీయాలు చిచ్చు పెట్టాయి. పవన్ పెట్టిన జనసేనలో కాకుండా వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరి ఆ పార్టీకి ప్రచారం చేశాడు ఆలీ. దీనిపై పవన్ ఓ పొలిటికల్ మీటింగ్‌లో విమర్శలు చేస్తే ఆలీ నొచ్చుకున్నాడు కూడా. దీంతో ఇద్దరి మధ్య అంతరం పెరిగింది. ఆ తర్వాత ఒకరి గురించి ఒకరు మాట్లాడింది లేదు.
ఐతే తాజాగా ఆలీ ఓ టీవీ ఛానెల్ ఫోన్ ఇన్ క్యార్యక్రమంలో భాగంగా పవన్‌తో తన అనుబంధం గురించి మాట్లాడు. పవన్‌కు మాత్రమే కాదు.. చిరంజీవికి కూడా తనంటే ప్రత్యేకమైన అభిమానం అని.. వాళ్లింట్లో ఏ శుభకార్యం జరిగినా తప్పక ఆహ్వానించే వాళ్లలో తన పేరు, బ్రహ్మానందం పేరు తప్పక ఉంటుందని ఆలీ చెప్పాడు. చిరు, పవన్‌లిద్దరికీ తానన్నా, బ్రహ్మానందం అన్నా ఎంతో ఇష్టమని ఆలీ చెప్పాడు.
‘గోకులంలో సీత’లో తాను, పవన్ తొలిసారి కలిసి నటించామని.. ‘తొలి ప్రేమ’తో తమ మధ్య అనుబంధం మొదలైందని.. ఆ తర్వాత ఇద్దరం కలిసి ఎన్నో సినిమాల్లో నటించామని, పవన్ సినిమా అంటే ఆలీ ఉండాల్సిందే అన్నట్లు తయారైందని.. చివరగా తామిద్దరం కలిసి ‘కాటమరాయుడు’ సినిమాలో కనిపించామని ఆలీ తెలిపాడు. ప్రతి సంవత్సరం తనకు చిరంజీవి ఇంటి నుంచి ఆవకాయ పచ్చడి డబ్బా వస్తుందని.. అలాగే పవన్ తనకు మామిడి పళ్లు పంపిస్తాడని.. ఐతే రాజకీయాల్లో పవన్ బిజీగా ఉండటం వల్లో ఏమో గత ఏడాది పళ్లు రాలేదని.. ఈసారి లాక్ డౌన్ అని.. వచ్చే ఏడాది పవన్ నుంచి మళ్లీ తనకు మామిడి పళ్లు వస్తాయని ఆశిస్తున్నానని ఆలీ చెప్పడం విశేషం.
Gulte Telugu Telugu Political and Movie News Updates