అందరు వారసుల్లాగే తానూ ఒక మాస్ హీరో అవ్వాలనే ఆశించాడు అక్కినేని నాగచైతన్య. కానీ అతను యాక్షన్ సినిమాలు చేసినపుడల్లా చేదు అనుభవాలే ఎదురయ్యాయి. కెరీర్ తొలి దశలో చేసిన జోష్, దడ, ఆటోనగర్ సూర్య లాంటి సినిమాలు బాగా ఆడి ఉంటే కథ వేరుగా ఉండేదమో. కానీ యాక్షన్ టచ్ ఉన్న, లార్జర్ దన్ లైఫ్ క్యారెక్టర్లు చేసినపుడల్లా చైతూకు నిరాశ మిగలగా.. అతను మామూలు కుర్రాడిలా కనిపిస్తూ చేసిన ప్రేమకథా చిత్రాలు మాత్రం చాలా మంచి ఫలితాలు అందుకున్నాయి.
చైతూ యాక్షన్ హీరో కాలేకపోయాడన్న అసంతృప్తి అక్కినేని అభిమానుల్లో ఉన్న మాట వాస్తవమే కానీ.. నిజానికి లార్జర్ దన్ లైఫ్ క్యారెక్టర్లు, యాక్షన్ సినిమాలు చేయడానికి టాలీవుడ్లో చాలామంది హీరోలున్నారు. ఆ బిల్డప్‌లు అవీ లేకుండా బాయ్ నెక్స్ట్ డోర్ క్యారెక్టర్లు చేసేవాళ్లే తక్కువ. అందులోనూ ఫ్యాన్ ఫాలోయింగ్, ఇమేజ్ ఉన్న హీరోల్లో ఇలాంటి పాత్రలు చేసేవాళ్లు మరీ అరుదు. చైతూ ఆ కోవకే చెందుతాడు.
చైతూ ఇప్పటిదాకా చేసిన క్యారెక్టర్లన్నీ ఒకెత్తయితే.. ‘లవ్ స్టోరి’లో చేసిన రేవంత్ పాత్ర మరో ఎత్తు. ఇలాంటి పాత్ర చేయడానికి ‘స్టార్’ స్టేటస్ ఉన్న మరే నటుడూ సాహసించడు అంటే అతిశయోక్తి కాదు. ఈ చిత్రంలో హీరో కులం ఏది అన్న ప్రస్తావన ఉండదు కానీ.. అతను ఎదుర్కొనే వివక్షను బట్టి తన కులం ఏంటన్నది ఒక ఐడియా వచ్చేస్తుంది. హీరో తన తల్లితో కలిసి ఒక అగ్ర వర్ణానికి చెందిన వాళ్ల ఇంటికి వెళ్తే.. వీళ్ల కాళ్లకు చెప్పులేసుకున్నారా లేదా అని చూసే సన్నివేశం ఒకటి ‘లవ్ స్టోరి’లో ఉంటుంది.
పైకి అందరూ ఆదర్శాలు వల్లించే వాళ్లే కానీ.. తెరపై ఇలాంటి సన్నివేశంలో నటించడానికి మాత్రం సంకోచిస్తారు. చైతూ ఎలాంటి శషబిషలు లేకుండా ఆ సన్నివేశం చేయడం.. సినిమాలో ఎక్కడా కూడా నాగచైతన్య కాకుండా రేవంత్ మాత్రమే కనిపించేలా ఒదిగిపోవడం గొప్ప విషయం. ఇక సినిమాలో చాలా చోట్ల హీరోయిన్ పాత్ర డామినేషన్ ఉన్నా కూడా చైతూ అభ్యంతర పెట్టలేదన్నది స్పష్టం.
మామూలుగా అయితే స్టార్ హీరోల ఇగో ఇందుకు అడ్డం పడుతుంది. కానీ దర్శకుడికి పూర్తిగా సరెండర్ అయి ఈ పాత్రలో ఎంత సింపుల్‌గా కనిపించాడో, ఆ పాత్రలో ఒదిగిపోయాడో సినిమా అంతటా తెలుస్తూనే ఉంటుంది. ఇందుకు అతణ్ని ఎంత అభినందించినా తక్కువే. క్యారెక్టర్ పరంగా, నటన పరంగా చైతూకు కెరీర్లోనే ‘ది బెస్ట్’ మూవీ ‘లవ్ స్టోరి’నే అనడంలో సందేహం లేదు.