బాలీవుడ్, కోలీవుడ్ మైండ్ బ్లాక్

బాలీవుడ్, కోలీవుడ్ డామినేషన్లో చాలా ఏళ్లు టాలీవుడ్ వెనుకబడే ఉంది. కానీ గత కొన్నేళ్లలో కథ మారిపోయింది. బాహుబలి మూవీ మిగతా ఇండస్ట్రీలను వెనక్కి నెట్టి టాలీవుడ్‌ను అగ్ర భాగాన నిలబెట్టింది. పేరుకు ప్రాంతీయ భాషా చిత్రాలే కానీ.. మన సినిమాలకు అంతకంతకూ పెరిగిపోతున్న వసూళ్లు చూసి ఆల్రెడీ బాలీవుడ్, కోలీవుడ్ అసూయ చెందుతూనే ఉన్నాయి.

యుఎస్ బాక్సాఫీస్‌లో మన సినిమాలకు వచ్చిన స్పందన చూసి చాలాసార్లు ఆ ఇండస్ట్రీ వాళ్లకు మైండ్ బ్లాంక్ అయింది. అలాగే మన చిత్రాల డబ్బింగ్ వెర్షన్లకు నార్త్ ఇండియాలో వచ్చే రెస్పాన్స్ కూడా అనూహ్యమే. ఇక కరోనా ప్రభావం మొదలయ్యాక టాలీవుడ్ ఇండియన్ బాక్సాఫీస్‌లో చూపించిన ఆధిపత్యం గురించి ఎంత చెప్పినా తక్కువే.

వేరే భాషల్లో సినిమాలు రిలీజ్ చేసుకోవడమే కష్టమవుతుంటే.. రిలీజ్ చేసినా కనీస స్పందన లేక అల్లాడుతుంటే.. ఫస్ట్ వేవ్ తర్వాత క్రాక్, ఉప్పెన, జాతిరత్నాలు, వకీల్ సాబ్ లాంటి సినిమాలు చూపించిన జోరుకు బాలీవుడ్, కోలీవుడ్ జనాలకు దిమ్మదిరిగిపోయింది. సెకండ్ వేవ్ తర్వాత అయినా తమ చిత్రాలు పుంజుకుంటాయేమో అని ఆశిస్తే.. ఇప్పటికీ అక్కడ కదలిక లేదు. రిలీజ్ చేసిన కొన్ని చిత్రాలు కూడా అడ్రస్ లేకుండా పోయాయి.

దీంతో ఎప్పటికి మామూలు పరిస్థితులు నెలకొంటాయో తెలియని అయోమయంలో పడిపోయారు. కానీ టాలీవుడ్ మాత్రం మరోసారి గొప్పగా పుంజుకుంది. గత రెండు నెలల్లో పెద్ద ఎత్తున సినిమాలు రిలీజయ్యాయి తెలుగులో. నిజానికి ఫస్ట్ వేవ్‌తో పోలిస్తే తెలుగు చిత్రాల ఊపు తక్కువే ఉంది. అందుక్కారణం ఏపీలో టికెట్ల రేట్లపై నియంత్రణ, మొన్నటి దాకా నైట్ షోలు లేకపోవడం కూడా ఒక కారణం. లేదంటే ఫస్ట్ వేవ్ తర్వాత చూసిన సందడే ఈసారి కూడా ఉండేది.

అయినప్పటికీ వేరే ఇండస్ట్రీలతో పోలిస్తే మన దగ్గర సినిమాల పరిస్థితి ఎంతో మెరుగే. వినాయక చవితికి రిలీజైన ‘సీటీమార్’ తొలి రోజు దాదాపు రూ.4 కోట్ల వసూళ్లతో సెకండ్ వేవ్ తర్వాత ఇండియాలోనే హైయెస్ట్ డే-1 గ్రాసర్‌గా నిలిచింది. ఇప్పుడు ‘లవ్ స్టోరి’ అంతకు రెట్టింపు వలర్డ్ వైడ్ డే-1 కలెక్షన్లతో బాలీవుడ్, కోలీవుడ్ జనాలను విస్మయానికి గురి చేసింది. ఈ సినిమాకు హాళ్ల దగ్గర హౌస్ ఫుల్ బోర్డులు, థియేటర్ల లోపల సందడికి సంబంధించి వీడియోలు, ఫొటోలు చూసి వాళ్లకు దిమ్మదిరిగిపోతోందనడంలో సందేహమే లేదు. మిడ్ రేంజ్ సినిమాకే ఇలా ఉంటే.. ఇక పెద్ద స్టార్ల సినిమాలు రిలీజైతే సందడి ఇంకెలా ఉంటుందో అంచనా వేయొచ్చు.