దసరా రేసులోకి కొత్త సినిమా

కరోనా మహమ్మారి కారణంగా గత ఏడాది దసరా సీజన్ వాషౌట్ అయిపోయింది. నిరుడు ఆ సీజన్లో థియేటర్లు మూతపడి ఉండటంతో సినిమాలేవీ రిలీజ్ కాలేదు. ఈ ఏడాది ఈ సీజన్ మీద భారీ అంచనాలే పెట్టుకున్నారు ప్రేక్షకులు. కానీ ఆచార్య, అఖండ లాంటి భారీ చిత్రాలు ఆశలు రేకెత్తించి.. చివరికి రేసు నుంచి తప్పుకున్నాయి.

కొన్ని రోజుల ముందు వరకు అయితే ఈ పండక్కి ఒక్క ‘మహా సముద్రం’ మాత్రమే ఖరారైంది. కానీ గత వారం వ్యవధిలో రెండు కొత్త సినిమాలు పండుగ రేసులోకి వచ్చాయి. అందులో ఒకటి.. రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణ, నిర్మాణంలో తెరకెక్కిన ‘పెళ్ళిసంద-డి’. ఇప్పుడు మరో చిత్రం దసరా రేసులో నిలిచింది. అదే.. వరుడు కావలెను. నాగశౌర్య, రీతూ వర్మ జంటగా కొత్త దర్శకురాలు సౌజన్య రూపొందించిన చిత్రమిది. దీనికి ఈ రోజే రిలీజ్ డేట్ ఇచ్చారు. అక్టోబరు 15న ‘వరుడు కావాలెను’ ప్రేక్షకుల ముందుకు రానుంది.

దసరా పండక్కి ముందు వారం కొండపొలం, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రాబోతున్న సంగతి తెలిసిందే. వాటి సందడి కొనసాగుతుండగానే ‘మహాసముద్రం’, ‘పెళ్ళిసంద-డి’, ‘వరుడు కావలెను’ థియేటర్లలోకి దిగబోతున్నాయి. ‘మహా సముద్రం’ అక్టోబరు 14కు ఖరారు కాగా.. తర్వాతి రోజు ‘వరుడు కావలెను’ రిలీజ్ కానుంది. ఇక ‘పెళ్ళి సంద-డి’ డేట్ తేలాల్సి ఉంది. దసరా బరిలో ఉన్న చిత్రాల్లో అత్యంత అంచనాలున్నది ‘మహా సముద్రం’ అనడంలో సందేహం లేదు. ‘ఆర్ఎక్స్ 100’ తర్వాత అజయ్ భూపతి రూపొందించిన ఈ చిత్రంలో శర్వానంద్, సిద్దార్థ్, అదితి రావు హైదరి, అను ఇమ్మాన్యుయెల్, జగపతిబాబు, రావు రమేష్ లాంటి ఆకర్షణీయ తారాగణం ఉన్నారు.

ఇటీవలే రిలీజైన ట్రైలర్ సినిమా మీద అంచనాలు పెంచింది. ఇక ‘వరుడు కావలెను’ విషయానికొస్తే దసరా పండక్కి కరెక్ట్‌గా సరిపోయే ఫ్యామిలీ ఎంటర్టైనర్ లాగా కనిపిస్తోంది. ఎటొచ్చీ ఓల్డ్ స్కూల్ మూవీలా కనిపిస్తున్న ‘పెళ్ళి సంద-డి’నే వీటి పోటీని ఎలా తట్టుకుని నిలబడుతుందో అన్న సందేహాలు కలుగుతున్నాయి.