హాట్ న్యూస్.. వెబ్ సిరీస్‌లో సాయిప‌ల్ల‌వి!

ఇంత‌కుముందులా వెబ్ సిరీస్‌ల‌ను త‌క్కువ‌గా చూసే ప‌రిస్థితి ఎంత‌మాత్రం లేదు. అలా చూసిన వాళ్లంద‌రూ అభిప్రాయాలు మార్చుకుంటున్నారు. గ‌త రెండేళ్ల‌లో ఓటీటీల హ‌వా బాగా పెరిగి వెబ్ సిరీస్‌లు పెద్ద ఎత్తున నిర్మిత‌మ‌వుతుండ‌టం.. వాటిని చూసేందుకు ప్రేక్ష‌కులు బాగా ఆస‌క్తి చూపిస్తుండ‌టంతో పెద్ద పెద్ద స్టార్లు సైతం డిజిట‌ల్ డెబ్యూకు రెడీ అయిపోతున్నారు. బాలీవుడ్లో అజ‌య్ దేవ‌గ‌ణ్, షాహిద్ క‌పూర్ లాంటి పెద్ద హీరోలు వెబ్ సిరీస్‌ల బాట ప‌ట్ట‌డం తెలిసిందే.

తెలుగులో విక్ట‌రీ వెంక‌టేష్‌, రానా డిజిట‌ల్ డెబ్యూకు రెడీ అయిన సంగ‌తి ఇప్ప‌టికే వెల్ల‌డైంది. త్వ‌ర‌లోనే సాయిప‌ల్ల‌విని సైతం ఓ వెబ్ సిరీస్‌లో చూసే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. త‌న కొత్త చిత్రం ల‌వ్ స్టోరి ప్ర‌మోష‌న్ల కోసం మీడియాను క‌లిసిన సంద‌ర్బంగా సాయిప‌ల్ల‌వినే స్వ‌యంగా ఈ విష‌యాన్ని వెల్ల‌డించింది.

భ‌విష్య‌త్తు ప్రాజెక్టుల గురించి అడ‌గ్గా.. తెలుగులో కొన్ని పెద్ద సినిమాల కోసం చ‌ర్చ‌లు జ‌రుగుతున్న‌ట్లు.. అలాగే త‌మిళం, మ‌ల‌యాళం, హిందీ భాష‌ల నుంచి కూడా అవ‌కాశాలు వ‌స్తున్న‌ట్లు సాయిప‌ల్ల‌వి చెప్పింది. వాటిలో ఏవీ ఖ‌రారు కాలేద‌ని చెప్పిన సాయిప‌ల్ల‌వి.. తాను ప్ర‌స్తుతం ఒక వెబ్ సిరీస్ వింటున్న‌ట్లు చెప్పింది. దానిపై తుది నిర్ణ‌యం ఇంకా తీసుకోలేద‌ని, త్వ‌ర‌లోనే డెసిష‌న్ చెబుతాన‌ని ఆమె చెప్పింది. సాయిపల్లవి ఓ వెబ్ సిరీస్‌లో నటిస్తే ఆ సిరీస్‌ మీద ప్రేక్షకుల్లో ప్రత్యేక ఆసక్తి నెలకొంటుందనడంలో సందేహం లేదు.

ఇక ల‌వ్ స్టోరి గురించి సాయిపల్లవి మాట్లాడుతూ.. ఫిదా త‌ర‌హాలోనే ల‌వ్ స్టోరి చిత్రాన్ని సైతం శేఖ‌ర్ క‌మ్ముల ఎంతో నిజాయితీగా తీశాడ‌ని.. భానుమ‌తి పాత్ర లాగే మౌనిక క్యారెక్ట‌ర్ కూడా ప్రేక్ష‌కుల‌ను క‌చ్చితంగా మెప్పిస్తుంద‌ని సాయిప‌ల్ల‌వి అంది. చిరంజీవితో బోళా శంక‌ర్ సినిమాను రిజెక్ట్ చేయ‌డంపై స్పందిస్తూ.. రీమేక్‌లంటే త‌న‌కు భ‌య‌మ‌ని, అలాగే త‌న‌కు ఆఫ‌ర్ చేసిన పాత్ర‌కు న్యాయం చేయ‌లేనేమో అన్న ఉద్దేశంతో కూడా ఆ సినిమాను వ‌దులుకున్న‌ట్లు సాయిప‌ల్ల‌వి చెప్పింది.