చైతూ పిలవలేదు.. ఆయనే వచ్చాడు


ఆమిర్ ఖాన్ లాంటి బాలీవుడ్ సూపర్ స్టార్ ఒక తెలుగు సినిమాకు సంబంధించిన వేడుకలో పాల్గొంటాడని ఎప్పుడైనా ఊహించామా? కానీ ఈ ఆదివారం ఈ ఆశ్చర్యకర దృశ్యం చూడగలిగాం. అక్కినేని నాగచైతన్య ఈ అదృష్టాన్ని దక్కించుకున్నాడు. ఆమిర్ కొత్త చిత్రం ‘లాల్ సింగ్ చద్దా’లో చైతూ ఓ ప్రత్యేక పాత్ర పోషించడం.. ఆ సందర్భంగా ఇద్దరి మధ్య బాగా సాన్నిహిత్యం ఏర్పడటం.. చైతూపై ఆమిర్‌కు చాలా మంచి అభిప్రాయం ఏర్పడటంతో తన కోసం హైదరాబాద్‌ వరకు వచ్చి ‘లవ్ స్టోరి’ ప్రి రిలీజ్ ఈవెంట్లో పాల్గొన్నాడు ఆమిర్.

ఐతే ఆమిర్‌తో పెరిగిన పరిచయాన్ని ఉపయోగించుకుంటూ.. కొంచెం మొహమాటంగా అయినా చైతూనే తన సినిమా ప్రమోషన్ కోసం ఆయన్ని ఈ ఈవెంట్‌కు రప్పించి ఉంటాడని చాలామంది అనుకున్నారు. కానీ అది నిజం కాదు. స్వయంగా ఆమిర్ ఖాన్ తనంతట తాను ఈ వేడుకకు వచ్చాడు. ఈ విషయాన్ని ఇటు ఆమిర్, అటు చైతూ ధ్రువీకరించారు కూడా.

మూణ్నాలుగు రోజుల కిందట తాను ‘లవ్ స్టోరి’ ట్రైలర్ చూశానని.. అది తనకు చాలా నచ్చిందని.. దీంతో తనకు తానుగా ‘లవ్ స్టోరి’ ప్రి రిలీజ్ ఈవెంట్‌కు వచ్చానని ఆమిర్ చెప్పాడు. నాగచైతన్య మంచి నటుడే కాదు.. ఎంత మంచి వ్యక్తో అతడి తల్లిదండ్రులతో పాటు అభిమానులందరికీ చెప్పాలన్న ఉద్దేశం కూడా తాను ఇక్కడికి రావడానికి కారణమని ఆమిర్ తెలిపాడు.

మరోవైపు చైతూ మాట్లాడుతూ.. ‘లవ్ స్టోరి’ ట్రైలర్ చూసి ఆమిర్ తనకు మెసేజ్ పంపాడని.. అప్పుడే క్యాజువల్‌గా ఈ ఆదివారం ఎక్కడుంటావని అడిగాడని.. ఇలా ‘లవ్ స్టోరి’ ప్రి రిలీజ్ ఈవెంట్ ఉందని తాను చెప్పానని.. అలా చెప్పగానే తాను ఆ ఈవెంట్‌కు వస్తానని ఆమిర్ అన్నాడని.. ఆయన ఈ వేడుకలో పాల్గొనడం ఇంకా నమ్మలేక పోతున్నానని చైతూ చెప్పాడు. ‘లాల్ సింగ్ చద్దా’ కోసం 45 రోజుల పాటు ఆమిర్‌తో పని చేసిన అనుభవాన్ని ఎప్పటికీ మరిచిపోలేనని.. ఈ అనుభవం తన జీవితాంతం ఒక పాఠంగా ఉపయోగపడుతుందని చైతూ అన్నాడు.