ట్రెండ్ సెట్ చేస్తున్న నితిన్

ఓటీటీకి సినిమా అమ్మేశాం అంటే అంత‌టితో త‌మ ప‌నైపోయింద‌ని చేతులు దులిపేసుకునే నిర్మాత‌లే ఎక్కువ‌. థియేట‌ర్ల‌లో సినిమా రిలీజైన‌పుడు ఎంత జాగ్ర‌త్త‌గా ప్ర‌మోష‌న్లు చేస్తారో కొత్త‌గా చెప్పాల్సిన ప‌ని లేదు. ఈ శ్ర‌ద్ధ ఓటీటీల‌కు అమ్మేసిన సినిమాల విష‌యంలో ఉండ‌దు. ఏదో నామ‌మాత్రంగా ప్ర‌మోష‌న్లు చేసి వ‌దిలేస్తుంటారు. గ‌త రెండేళ్ల‌లో ఓటీటీల్లో రిలీజైన సినిమాల లిస్టు తీస్తే.. అస‌లు ప్ర‌మోష‌న్ అన్న‌దే చేయ‌ని సినిమాలు కూడా చాలా క‌నిపిస్తాయి.

మంచి రేటుకు సినిమాను ఓటీటీల‌కు అమ్మిన‌పుడు.. వాళ్ల‌కు గిట్టుబాటు అయ్యేలా సినిమాను బాగా ప్ర‌మోట్ చేసి ప్రేక్ష‌కుల్లో ఆస‌క్తి పెంచాల్సిన బాధ్య‌త ఆయా చిత్ర బృందాల‌పై ఉంటుంది. ఇందుకోసం కొంత ఖ‌ర్చు పెట్ట‌డం అవ‌స‌రం కూడా. దాని వ‌ల్ల ఓటీటీల‌కు ప్ర‌యోజ‌నం క‌లిగి త‌ర్వాత కూడా సినిమాల‌కు మంచి రేటు ఇస్తారు.

ఐతే ఈ విష‌యాన్ని యంగ్ హీరో నితిన్ బాగానే అనుస‌రిస్తున్నాడు. తాను హీరోగా న‌టిస్తూ సొంత నిర్మాణ సంస్థ‌లో నిర్మించిన‌ కొత్త చిత్రం మాస్ట్రోను అత‌ను ప్ర‌మోట్ చేసిన తీరు ప్ర‌శంస‌నీయం. ఓటీటీల్లో రిలీజైన సినిమాల్లో ఇప్ప‌టిదాకా దేనికీ చేయ‌ని విధంగా రెగ్యుల‌ర్ సినిమాల‌కు చేసే త‌ర‌హాలోనే పెద్ద స్థాయిలో అత‌ను మంగ‌ళ‌వారం ప్రి రిలీజ్ ఈవెంట్ నిర్వ‌హించాడు. ఓటీటీ సినిమా క‌దా అని తేడానే చూపించ‌లేదు. ఈ ఈవెంట్ అనే కాదు.. ఈ సినిమా కోసం అర కోటి దాకా ఖ‌ర్చు పెట్టి నితిన్ ఒక ప్ర‌మోష‌న‌ల్ సాంగ్ కూడా చేశాడు.

అలాగే టీవీల్లో, బ‌య‌ట మాస్ట్రో ప్ర‌చార చిత్రాలు కూడా హోరెత్తిపోతున్నాయి. హైద‌రాబాద్ సిటీలో పెద్ద పెద్ద హోర్డింగ్స్ పెట్టి ఈ సినిమాను ప్ర‌మోట్ చేస్తున్నారు. తెలుగులో ఒక ఓటీటీ సినిమాకు ఈ స్థాయి ప్ర‌చారం ఇప్ప‌టిదాకా జ‌ర‌గ‌లేదు. ఈ విష‌యంలో నితిన్ అండ్ కో ట్రెండ్ సెట్ చేస్తున్నాడ‌నే చెప్పాలి. మిగ‌తా వాళ్లు కూడా దీన్ని అందిపుచ్చుకుంటే అది టాలీవుడ్‌కు మంచిదే.