ఇండియాలో ప్రస్తుతం ట్రూ పాన్ ఇండియా రైటర్ అంటే విజయేంద్ర ప్రసాద్ పేరే చెప్పాలి. ఆయన వివిధ భాషల్లో భారీ చిత్రాలకు రచన చేస్తూ తన సత్తా చాటుతున్నారు. ‘బాహుబలి’తో వచ్చిన పేరును చాలా బాగా ఉపయోగించుకుని.. హిందీలో భజరంగి భాయిజాన్, మణికర్ణిక.. తమిళంలో మెర్శల్, తలైవి.. కన్నడలో జాగ్వార్ లాంటి భారీ చిత్రాలకు ఆయన పని చేశారు. హిందీలో ఆయనకు డిమాండ్ అంతకంతకూ పెరుగుతోందే తప్ప తగ్గట్లేదు.
తాజాగా ఆయన ‘సీత’ పేరుతో ఓ స్క్రిప్టు రాశారు. రామాయణాన్ని సీత కోణంలో చూపించే మెగా బడ్జెట్ మూవీ ఇది. ఈ సినిమాకు కొన్ని నెలల ముందే స్క్రిప్టు పూర్తయింది కానీ.. అందులో లీడ్ రోల్ చేసే నటి ఎవరన్నదే తేలలేదు. కరీనా కపూర్ అని.. దీపికా పదుకొనే అని.. రకరకాల పేర్లు వినిపించాయి. కానీ చివరికి విజయేంద్ర ప్రసాద్ ఫేవరెట్ యాక్ట్రెస్ కంగనా రనౌత్‌నే ఈ చిత్రంలో ప్రధాన పాత్రకు ఖరారు చేశారు.
‘మణికర్ణిక’ సమయంలో కంగనాతో విజయేంద్ర ప్రసాద్‌కు మంచి అనుబంధం ఏర్పడింది. ఆయన్ని ఆమె గురువులా చూస్తుంది. బాలీవుడ్లో పెద్ద పెద్ద వాళ్లను అసలేమాత్రం కేర్ చేయని కంగనా.. విజయేంద్రను మాత్రం ఎంతో గౌరవిస్తుంది. ‘మణికర్ణిక’ టైంలో ఆమె విజయేంద్రకు పాదాభివందనం కూడా చేయడం గమనార్హం. ఆయన చెప్పాడనే తమిళంలో జయలలిత జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ‘తలైవి’ సినిమాలో నటించింది. ఈ చిత్రం ఆశించిన ఫలితాన్నివ్వకపోయినప్పటికీ ఆమె విజయేంద్ర రాసిన మరో స్క్రిప్టుతో సినిమా చేయడానికి ఓకే చెప్పింది.
‘సీత’ పేరుతోనే తెరకెక్కనున్న ఈ చిత్రానికి విజయేంద్ర కథతో పాటు స్క్రీన్ ప్లే కూడా సమకూరుస్తున్నాడు. అలౌకిక్ దేశాయ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని హ్యూమన్ బీయింగ్ స్టూడియో నిర్మించనుంది. హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు.