యాక్సిడెంటైన‌ హీరోయిన్ ఇప్పుడెలా ఉందంటే..?

యాషికా ఆనంద్.. త‌మిళంలో మీడియం రేంజ్ హీరోయిన్. సినిమాల‌తో కంటే హాట్ హాట్ ఫొటో షూట్ల‌తో ఈ అమ్మాయి బాగా పాపుల‌ర్ అయింది. ఎప్పుడూ ఎంతో హుషారుగా క‌నిపించే ఈ అమ్మాయి.. నెల‌న్న‌ర నుంచి ఆసుప‌త్రిలో బెడ్‌కు ప‌రిమిత‌మై ఉండ‌టం విచార‌క‌ర విష‌యం. జులై 24న యాషిక ప్ర‌యాణిస్తున్న కారుకు యాక్సిడెంట్ కావ‌డం.. అందులో యాషిక తీవ్రంగా గాయ‌ప‌డ‌టం.. త‌న‌తో పాటు ప్ర‌యాణిస్తున్న ఫ్రెండ్ ప్రాణాలు కోల్పోవ‌డం తెలిసిందే. రెండు కాళ్లు విరిగిపోవ‌డంతో పాటు యాషిక‌కు మ‌రికొన్ని గాయాలు కూడా అయ్యాయి.

ఆమె పూర్తిగా కోలుకుని బ‌య‌ట తిర‌గ‌డానికి క‌నీసం ఆరు నెల‌లు ప‌ట్టొచ్చ‌ని అప్ప‌ట్లో వార్త‌లొచ్చాయి. ఆసుప‌త్రిలో యాషికకు సంబంధించిన ఫొటోలేవీ బ‌య‌టికి రాలేదు. ఆమె సోష‌ల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా లేదు.

ఐతే ప్ర‌మాదం నుంచి ఇప్పుడిప్పుడే కొంచెం కోలుకుంటున్న యాషిక‌.. నెమ్మ‌దిగా సోష‌ల్ మీడియాలో యాక్టివ్ అయ్యే ప్ర‌య‌త్నం చేస్తోంది. ఈ క్ర‌మంలోనే ప్ర‌మాదం త‌ర్వాత త‌న ఫొటోను తొలిసారిగా ట్విట్ట‌ర్లో పోస్ట్ చేసింది. మై స్ట్రెంత్ అంటూ ఒక వైపు త‌న‌కు అన్నం తినిపిస్తున్న‌ మ‌హిళ (బ‌హుశా త‌ల్లి అయ్యుండొచ్చు).. ఇంకోవైపు త‌న పెంపుడు కుక్క‌తో ఉన్న ఫొటోను యాషిక షేర్ చేసింది.

ఆమె కాళ్ల‌కు పెద్ద‌ క‌ట్లు ఉన్నాయి. స‌రిగా తిండి తిన‌క‌పోవ‌డం వ‌ల్ల యాషిక బ‌రువు త‌గ్గిన‌ట్లు క‌నిపిస్తోంది. ముఖం పీక్కుపోయి క‌నిపిస్తోంది. త‌న కాళ్ల‌కున్న క‌ట్లు చూస్తే ఆమె లేచి న‌డ‌వ‌డానికి కొన్ని నెల‌లు ప‌ట్టేట్లే ఉంది. యాషిక‌ను ఇలాంటి స్థితిలో చూసిన వాళ్లంద‌రికీ అయ్యో అనిపిస్తోంది. ఆమె త్వ‌ర‌గా కోలుకుని మళ్లీ సినిమాల్లోకి పున‌రాగ‌మ‌నం చేయాల‌ని త‌న అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.