త‌మ‌న్నాను భ‌లే ఉప‌యోగించుకుంటాడే..


ప్ర‌తి ద‌ర్శ‌కుడికీ కెరీర్లో ఏదో ఒక ద‌శ‌లో ఒక హీరోయిన్ మీద బాగా గురి కుదురుతుంది. ఆ హీరోయిన్‌తో వ‌రుస‌గా సినిమాలు చేయ‌డం.. వాళ్ల‌ను మిగ‌తా హీరోయిన్ల‌తో పోలిస్తే బాగా ప్రెజెంట్ చేయ‌డం జ‌రుగుతుంటుంది. యువ ద‌ర్శ‌కుడు సంప‌త్ నంది అలా స్పెష‌ల్ ఫోక‌స్ పెట్టే హీరోయిన్‌ త‌మ‌న్నానే అన‌డంలో మ‌రో మాట లేదు. ఈ ద‌ర్శ‌కుడు ఇప్ప‌టిదాకా తీసిన సినిమాలు అయిదు అయితే.. అందులో మూడింట్లో త‌మ‌న్నానే క‌థానాయిక కావ‌డం విశేషం.

ఏమైంది ఈవేళ మూవీతో హిట్టు కొట్టి ఒకేసారి మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌తో సినిమా చేసే అవ‌కాశం ద‌క్కించుకున్న సంప‌త్.. అందులో క‌థానాయిక‌గా త‌మ‌న్నాను తీసుకున్నాడు. అందులో వానా వానా వెల్లువాయి పాటలో త‌మ‌న్నాను చూపించిన తీరుకు కుర్రాళ్లు ఫిదా అయిపోయారు. అప్ప‌టిదాకా త‌న కెరీర్లో త‌మ‌న్నా అంత ఆక‌ర్ష‌ణీయంగా మ‌రే చిత్రంలో క‌నిపించ‌లేదంటే అతిశ‌యోక్తి కాదు. ఆపై కొంచెం గ్యాప్ తీసుకుని సంప‌త్ తీసిన బెంగాల్ టైగ‌ర్ మూవీలోనూ త‌మ‌న్నా ఎంత‌గా హైలైట్ అయిందో తెలిసిందే. ఒక పాట‌లో త‌మ‌న్నా గ్లామ‌ర్‌ను సంప‌త్ ఎవేట్ చేసిన తీరు సినిమాకు బాగా ప్ల‌స్ అయింది.

ఇక తాజాగా సంప‌త్ నుంచి వ‌చ్చిన సీటీమార్ మూవీలోనూ త‌మ‌న్నానే హీరోయిన్. ఈ చిత్రానికి కూడా త‌మ‌న్నా ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలుస్తోంది. జ్వాలారెడ్డి పాట‌తో ఈ సినిమాకు హైప్ రావ‌డానికి కార‌ణ‌మే త‌మ‌న్నా. ఆ పాట‌లో త‌మ‌న్నా సెక్సీ అప్పీయ‌రెన్స్, మాస్ స్టెప్స్ పాట‌ను వేరే లెవెల్‌కు తీసుకెళ్లాయి. ఈ పాట సినిమాలో మేజ‌ర్ హైలైట్ల‌లో ఒక‌ట‌న‌డంలో సందేహం లేదు. మొత్తంగా చూస్తే త‌మ‌న్నాను త‌న సినిమాల కోసం ఇంత బాగా ఉప‌యోగించుకున్న ద‌ర్శ‌కుడు మ‌రొక‌రు లేరంటే అతిశ‌యోక్తి కాదు.