ఆర్ఆర్ఆర్.. అలా ఫిక్సయిపోవచ్చు


‘బాహుబలి’ తర్వాత ఇండియాలో ఆ స్థాయి హైప్ ఉన్న సినిమా అంటే.. ‘ఆర్ఆర్ఆర్’యే. ఈ సినిమా మొదలైనప్పుడు ఉన్న సందేహాలు ఇప్పుడు చెరిగిపోయినట్లే ఉన్నాయి. మరోసారి ‘బాహుబలి’ తరహా భారీ చిత్రం తీసి, ప్రేక్షకులకు విజువల్ ఫీస్ట్ ఇవ్వడానికి జక్కన్న రెడీ అయినట్లే ఉన్నాడు. ఐతే కరోనా దెబ్బను తట్టుకుని వీలైనంత త్వరగానే సినిమాను పూర్తి చేసినప్పటికీ మరోసారి రిలీజ్ వాయిదా వేయక తప్పట్లేదు. అక్టోబరు 13న తమ చిత్రం రావట్లేదని ఎట్టకేలకు చిత్ర బృందం క్లారిటీ ఇచ్చేసింది. కానీ కొత్త రిలీజ్ డేట్ మాత్రం ఇప్పుడే చెప్పలేమని పేర్కొంది.

మరి ‘ఆర్ఆర్ఆర్’ ఎప్పుడు రిలీజవుతుందనే చర్చ మొదలైంది. ఆ సినిమా విడుదలను బట్టి వివిధ భాషల్లో చాలా సినిమాల రిలీజ్ డేట్లు ఖరారవుతాయి. అందుకే ‘ఆర్ఆర్ఆర్’ టీం నుంచి స్పష్టత కోరుకుంటున్నారు.

కానీ నార్త్ ఇండియాలో చాలా చోట్ల థియేటర్లపై ఆంక్షలు కొనసాగుతుండటం.. అలాగే జనాలు మళ్లీ థియేటర్లకు ఇంకా అలవాటు పడకపోవడంతో ‘ఆర్ఆర్ఆర్’ లాంటి భారీ చిత్రాన్ని ఈ కష్ట కాలంలో రిలీజ్ చేయడానికి భయపడుతున్నారు. కాస్తయినా నార్త్ మార్కెట్ పుంజుకుంటే తప్ప ‘ఆర్ఆర్ఆర్’ వచ్చేలా లేదు. ఐతే అక్టోబరు 21న పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నీ ముగిసిపోతాయని చిత్ర బృందం అంటున్న నేపథ్యంలో ఆరేడు నెలలు ఎదురు చూసి 2022 వేసవికి ఈ చిత్రాన్ని విడుదల చేస్తారని అనుకోలేం.

వందల కోట్ల ఖర్చుతో తీసిన సినిమాను అంత కాలం ఆపితే.. పడే వడ్డీల భారం ఏ స్థాయిలో ఉంటుందో చెప్పాల్సిన పని లేదు. అలా ఆలస్యమయ్యే కొద్దీ నిర్మాత ఆదాయం కోల్పోతున్నట్లే. అలాగని ఇప్పుడిప్పుడే సినిమాను విడుదల చేసే సాహసమూ చేయకపోవచ్చు. చిత్ర వర్గాల సమాచారం ప్రకారం వీలును బట్టి 2022 సంక్రాంతి ముంగిటే ఈ చిత్రాన్ని రిలీజ్ చేద్దామనుకుంటున్నారట. సంక్రాంతి సినిమాలతో పోటీ పడకుండా వారం ముందే జనవరి 8న ఈ సినిమాను రిలీజ్ చేసే యోచన ఉంది. కాకపోతే అప్పటికి మార్కెట్ ఆశావహంగా ఉండాలి. కాని పక్షంలో 2022 లేట్ సమ్మర్లో ఈ చిత్రాన్నిఆశించవచ్చు.