మెగాస్టార్ మేనల్లుడు.. టాలీవుడ్ యంగ్ హీరో సాయిధరమ్ తేజ్ వినాయక చవితి పర్వదినాన హైదరాబాద్‌లో యాక్సిడెంట్‌కు గురై ఆసుపత్రి పాలవడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. సిటీలోని ఐకియా రోడ్డులో అతను బైక్ మీద వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. అదృష్టవశాత్తూ అతడికి తీవ్ర గాయాలేమీ కాలేదని తేలింది. నిన్న అల్లు అరవింద్, ఈ రోజు చిరంజీవి తేజు ఆరోగ్యం నిలకడగానే ఉందని, ప్రమాదమేమీ లేదని క్లారిటీ ఇచ్చారు. తేజు చికిత్స పొందుతున్న అపోలో ఆసుపత్రి నిన్న రాత్రే కాక శనివారం కూడా హెల్త్ బులిటెన్ ఇచ్చింది. తేజుకు ప్రమాదమేమీ లేదని స్పష్టత ఇచ్చింది. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
ఐతే ఇప్పుడందరి దృష్టీ అసలు యాక్సిడెంట్ ఎలా జరిగిందనే దాని మీదికి వెళ్లింది. ఇలాంటి ఉదంతాల్ని బ్లో అప్ చేయడానికి చాలామంది కాచుకుని ఉంటారు. తేజు మద్యం తాగాడా.. ఓవర్ స్పీడ్‌లో వెళ్లాడా.. హెల్మెట్ పెట్టుకోలేదా.. ఇంకేమైనా తప్పులు చేశాడా అని శోధించే పనిలో ఒక వర్గం పడిపోయింది. కానీ వాళ్లకు నిరాశను మిగులుస్తూ ఈ యాక్సిడెంట్లో తేజు అలాంటి తప్పులేమీ చేయలేదని తేలింది. స్వయంగా ఈ విషయంలో పోలీసులే స్పష్టత ఇచ్చారు.
తేజు ప్రమాదానికి సంబంధించి సీసీటీవీ ఫుటేజ్ బయటికి వచ్చింది. అతను రోడ్డు మధ్యలో 60-70 కిలోమీటర్ల స్పీడుతో (అంచనా) వెళ్తూ ముందు ఒక వాహనాన్ని తప్పించడానికి బ్రేక్ వేయగా.. స్కిడ్ అయి కింద పడిపోయాడు. రోడ్డు మీద ఇసుక ఉండటం వల్ల బైక్ స్కిడ్ అయింది. బైక్ కింద పడగానే జారుతూ ముందుకెళ్లగా.. తేజు దాన్నుంచి కింద పడి ముందుకు జారుతూ వెళ్లాడు. ఈ క్రమంలో చిన్న గాయాలు అయ్యాయి. ప్రమాద సమయంలో హెల్మెట్ పెట్టుకుని ఉండటం వల్ల అతడికి ప్రాణాపాయం తప్పింది. తేజు మద్యం ఏమీ తాగలేదని, హెల్మెట్ పెట్టుకున్నాడని, ఓవర్ స్పీడ్లో వెళ్లలేదని పోలీసులు ధ్రువీకరించారు.