‘గౌతమ్ నంద’లో తప్పులు జరిగాయి-గోపీచంద్

గోపీచంద్ కెరీర్లోనే అత్యధిక బడ్జెట్లో తెరకెక్కిన చిత్రం ‘గౌతమ్ నంద’. నాలుగేళ్ల కిందట మంచి అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా.. ఆశించిన ఫలితాన్నందుకోలేదు. మంచి కథ, ఇంట్రెస్టింగ్ ట్విస్ట్, గోపీచంద్ కెరీర్లోనే ది బెస్ట్ అనదగ్గ పెర్ఫామెన్స్, లావిష్ మేకింగ్.. ఇలాంటి ప్లస్సులు ఉన్నప్పటికీ కథనంలో కొన్ని లోపాల వల్ల సినిమా సరిగా ఆడలేదు. ఈ ఫలితం గోపీని అప్పట్లో తీవ్ర నిరాశకు గురి చేసింది.

చాలా కష్టపడి, ఇష్టపడి చేసిన సినిమాకు అలాంటి ఫలితం వస్తే ఎవరికైనా బాధ ఉంటుంది. ఆ బాధ ఇప్పటికీ వెంటాడుతున్నప్పటికీ.. నిజాయితీగా ఆ సినిమాలో కొన్ని తప్పులు జరిగాయంటూ తన కొత్త చిత్రం ‘సీటీమార్’ ప్రమోషన్ల సందర్భంగా గోపీచంద్ ఒప్పుకుంటున్నాడు. ఇప్పటికే కొన్ని ఇంటర్వ్యూల్లో తన కెరీర్లో జరిగిన తప్పుల గురించి ఓపెన్‌గా మాట్లాడిన గోపీ.. తాజాగా ‘సీటీమార్’ ప్రి రిలీజ్ ఈవెంట్లో ‘గౌతమ్ నంద’ ప్రస్తావన తెచ్చాడు.

‘గౌతమ్ నంద’ దర్శకుడు సంపత్ నందినే ‘సీటీమార్’ సినిమాను డైరెక్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని గుర్తు చేస్తూ సంపత్, తాను కలిసి కష్టపడి ‘గౌతమ్ నంద’ చేశామని.. సినిమా బాగానే వచ్చినా అందులో కొన్ని తప్పులు చోటు చేసుకున్నాయని.. అవేంటని ఆలోచించి మళ్లీ అలాంటి తప్పులు జరగకుండా ‘సీటీమార్’ చేశామని గోపీ చెప్పాడు. ‘సీటీమార్’ పక్కా కమర్షియల్ మూవీ అని.. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్‌లో చేయడం తనకు కొత్త అని గోపీచంద్ అన్నాడు.

కరోనా దెబ్బను తట్టుకుని కష్టపడి, రాజీ లేకుండా ఈ సినిమా చేశామని.. తమ సినిమా కోసం ఇండస్ట్రీ మొత్తం ఎదురు చూస్తోందని.. ‘సీటీమార్’ బాగా ఆడితే చాలా సినిమాలు థియేటర్లలోకి వస్తాయని.. అందుకే ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు ఆశీర్వదించాలని గోపీ అన్నాడు. ఇళ్లలో ఉన్న ప్రేక్షకులను కచ్చితంగా బయటికి లాక్కొచ్చి థియేటర్లలో సినిమా చూసేలా ‘సీటీమార్’ చేస్తుందని గోపీచంద్ ధీమా వ్యక్తం చేశాడు. తమ సినిమాకు విషెస్ చెప్పిన మెగాస్టార్ చిరంజీవికి గోపీచంద్ థ్యాంక్స్ చెప్పాడు. ‘సీటీమార్’ ట్రైలర్ చూసి తన ఫ్రెండ్ ప్రభాస్ ఫోన్ చేసి చాలా బాగుందని చెప్పినట్లు గోపీచంద్ వెల్లడించాడు.