ఆర్ఆర్ఆర్ ఓటీటీలో కాదట

‘బాహుబలి’ తర్వాత రాజమౌళి రూపొందిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడింది. మూడో పర్యాయం కూడా వాయిదా అనివార్యం అని తేలిపోయింది. అక్టోబరు 13న ఈ చిత్రం విడుదల కావట్లేదు. ఈ మేరకు ప్రకటన రావడం లాంఛనమే అని భావిస్తున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలకు తగినంత సమయం లేకపోవడానికి తోడు.. హిందీ మార్కెట్ కరోనా దెబ్బ నుంచి కోలుకోకపోవడం ఇందుకు ముఖ్య కారణం.

అక్షయ్ కుమార్ సినిమా ‘బెల్ బాటమ్’ను భారీ స్థాయిలో రిలీజ్ చేస్తే ఆ చిత్రానికి వచ్చిన కనీస వసూళ్లు చూసి బాలీవుడ్ షాకైపోయింది. దీంతో విడుదలకు సిద్ధమైన మరికొన్ని చిత్రాలు వెనక్కి వెళ్లాయి. థియేట్రికల్ రెవెన్యూ మీద ఆశలు కోల్పోయిన నిర్మాతలు.. చాలా సినిమాలను ఓటీటీల్లో రిలీజ్ చేయడానికి రెడీ అయిపోతున్నారు. ఈ క్రమంలో ‘ఆర్ఆర్ఆర్’ సైతం ఓటీటీలో రిలీజవుతుందంటూ బాలీవుడ్లో ప్రచారాలు మొదలవడం షాక్ ఇచ్చే విషయం.

‘ఆర్ఆర్ఆర్’ ఓటీటీలో రిలీజ్ కాదంటూ ఈ చిత్ర హిందీ హక్కులు సొంతం చేసుకున్న పెన్ మూవీస్ సంస్థ ప్రకటన ఇవ్వడం గమనార్హం. ఆర్ఆర్ఆర్‌తో పాటు తమ సంస్థ నుంచి రావాల్సిన ‘యాక్షన్’ చిత్రం గురించి ఆ సంస్థ స్పష్టత ఇచ్చింది. ఈ రెండు చిత్రాలూ ఓటీటీల్లో రిలీజవుతాయని వార్తలొస్తున్నాయని, అవి అబద్ధమని.. ఈ రెండు చిత్రాలూ థియేటర్లలోనే రిలీజవుతాయిన పెన్ మూవీస్ ప్రకటన ఇచ్చింది.

ఐతే ఈ స్టేట్మెంట్ చూసి మన జనాలు నవ్వుకుంటున్నారు. రాజమౌళి సినిమా ఏంటి.. ఓటీటీలో రిలీజవ్వడమేంటి.. అలాంటి ప్రచారం ఎలా చేశారు అని షాకవుతున్నారు జనాలు. ‘ఆర్ఆర్ఆర్’ లాంటి సినిమా కూడా ఓటీటీ బాట పడితే.. ఇక థియేటర్లను ఎవ్వరూ కాపాడలేరని, అవి చరిత్రలో కలిసిపోయినట్లని అర్థం చేసుకోవాల్సిందే. కొన్ని నెలల తర్వాతైనా థియేటర్లు పుంజుకుంటాయని, పరిస్థితులను బట్టి సరైన సమయంలో ‘ఆర్ఆర్ఆర్’ను రిలీజ్ చేద్దామని చిత్ర బృందం భావిస్తోంది.