కంగనా రనౌత్ ఎంత గొప్ప నటో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. గత కొన్నేళ్లలో క్వీన్, మణికర్ణిక సహా కొన్ని చిత్రాల్లో అసాధారణమైన నటన కనబరిచి కోట్లమందికి ఫేవరెట్ హీరోయిన్ అయిందామె. వ్యక్తిగతంగా డేరింగ్ అండ్ డాషింగ్ ఇమేజ్ ఉన్న కంగనా.. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, ఐరన్ లేడీగా పేరున్న జయలలిత పాత్రలో నటించనుందన్న వార్త బయటికి రాగానే అందరూ ఎగ్జైట్ అయ్యారు.
లుక్స్ విషయంలో జయలలితను కంగనా మ్యాచ్ చేయగలదా అన్న సందేహాలు కలిగాయి కానీ.. కంగనా కష్టానికి మేకప్ నైపుణ్యం కూడా తోడవడంతో ఈ విషయంలో పెద్ద ఇబ్బంది లేకపోయింది. ప్రోమోల్లో కంగనా స్క్రీన్ ప్రెజెన్స్, హావభావాలు చాలా బాగా అనిపించి తలైవి మీద అంచనాలు పెరిగాయి. ఐతే నిజానికి ఈ సినిమాలో జయలలిత పాత్ర కోసం ముందు అనుకున్నది కంగనా రనౌత్ పేరు కాదట.
ఈ చిత్ర రచయిత విజయేంద్ర ప్రసాదే ఆమె పేరును సూచించాడట. తలైవి ప్రి రిలీజ్ ఈవెంట్లో ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. ఈ సినిమాకు స్క్రిప్టు రాయమన్నపుడు చాలా సంతోషంగా ఒప్పుకున్నానని.. కానీ అప్పటికి మేకర్స్ వేరే హీరోయిన్ని జయలలిత పాత్రకు అనుకున్నారని.. కానీ తాను కంగనా పేరును సూచించానని విజయేంద్ర తెలిపారు. కానీ ఈ సినిమాలో నటించమని కంగనాను అప్రోచ్ అయ్యేదెవరు.. ఆమెకు కథ నచ్చకపోతే మనల్ని బతకనివ్వదే అన్న భయం కలిగిందని ఆయనన్నారు.
ఐతే అదృష్టవశాత్తూ కంగనాకు కథ నచ్చిందని.. జయలలిత పాత్రలో ఆమె అద్భుతంగా నటించిందని.. ఈ సినిమా తర్వాత కంగనా టాప్ చైర్లో ఉంటుందని ముందే చెప్పానని విజయేంద్ర పేర్కొన్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates