రోజుకో మలుపు తిరుగుతున్న మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల వ్యవహారంలో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. ప్రకాష్ రాజ్ ప్యానెల్‌కు అధికారిక ప్రతినిధిగా ఉంటూ ఆ ప్యానెల్‌కు మద్దతుగా ఇన్నాళ్లూ మాట్లాడుతూ వచ్చిన నటుడు, నిర్మాత బండ్ల గణేష్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. ఆ ప్యానెల్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు.
ముందుగా తాను వ్యక్తిగత కారణాలతో ప్రకాష్ రాజ్ ప్యానెల్ నుంచి తప్పుకుంటున్నట్లు ట్వీట్ వేసిన బండ్ల.. ఆ తర్వాత ఇంకో ట్విస్ట్ ఇచ్చాడు. తాను రాబోయే ఎన్నికల్లో ‘మా’ జనరల్ సెక్రటరీ పదవికి పోటీ చేస్తున్నట్లు ప్రకటించాడు. తాజాగా ప్రకాష్ రాజ్ ప్రకటించిన ప్యానెల్లో బండ్ల గణేష్ పేరు లేకపోవడం చర్చనీయాంశం అయింది.
ప్యానెల్లో తన పేరు లేకపోవడంతో పాటు జీవితను జనరల్ సెక్రటరీ పదవికి పోటీలో నిలపడం కూడా బండ్లకు నచ్చలేదని.. ఈ విషయంలో మనస్తాపం చెందే తాజా నిర్ణయాన్ని ప్రకటించాడని భావిస్తున్నారు.
తాను జనరల్ సెక్రటరీగా పోటీ చేసే విషయమై బండ్ల ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. “మాట తప్పను .. మడమ తిప్పను. నాది ఒకటే మాట ఒకటే బాట. నమ్మడం నమ్మినవారి కోసం బతకడం. నా మనస్సాక్షి చెప్పినట్టు నడుచుకుంటాను. నేను ఎవరిమాట వినను. త్వరలో జరిగే మా ఎన్నికల్లో జనరల్ సెక్రటరీగా పోటీ చేస్తాను. ఘన విజయం సాధిస్తాను! మనస్సాక్షికి ఎంతచెప్పినా మాట వినడం లేదు. నన్ను పోటీ చెయ్ అంటోంది. అందుకే ఈ పోటీ.
అందరికీ అవకాశం ఇచ్చారు. ఒకేఒక అవకాశం నాకివ్వండి. నేనేంటో చూపిస్తా. నా పరిపాలన ఏంటో తెలియజేస్తా. వంద మంది పేద కళాకారులకు డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇవ్వడం నా ధ్యేయం. దానికోసం పోరాడతా. వారి సొంత ఇంటి కల నిజం చేస్తా. ఇప్పుడు పదవుల్లో ఉన్నవాళ్లు రెండేళ్లుగా ఏమీ చేయలేదు. ఇప్పుడు చేస్తామంటే ‘మా’ సభ్యులు నమ్మరు. గొడవలతో ‘మా’ సభ్యులను మోసం చేసింది చాలు. ఇక అలా జరగొద్దు. అందరి ఆశీస్సులు కావాలి. ‘మా’ను బలోపేతం చేద్దాం. ముఖ్యంగా పేద కళాకారులకు సొంతింటి కల నిజం చేద్దాం” అంటూ వరుస ట్వీట్లు గుప్పించాడు బండ్ల.
Gulte Telugu Telugu Political and Movie News Updates