అవసరాల వాడుకుంటాడా?


బోలెడన్ని థియేటర్లు అందుబాటులో ఉన్నాయి. రిలీజవుతున్నవేమో చిన్న, మీడియం రేంజ్ సినిమాలే. సరైన సినిమాలు పడితే థియేటర్లకు రావడానికి ప్రేక్షకులు కూడా రెడీగా ఉన్నారు. కానీ వారు కోరుకున్న స్థాయి వినోదాన్నందించే సినిమాలు అంతగా రావట్లేదు కరోనా సెకండ్ వేవ్ బ్రేక్ తర్వాత. గత వారం వచ్చిన సినిమాలన్నీ వాషౌట్ అయిపోయాయి. అంతకుముందు వారాల్లో వచ్చిన చిత్రాలు ఇప్పటిదాకా థియేటర్లలో నిలబడే పరిస్థితి లేదు. ఇలాంటి పరిస్థితుల్లో రెండు చిన్న సినిమాలు ప్రేక్షకుల తీర్పు కోసం సిద్ధమయ్యాయి. అవే.. నూటొక్క జిల్లాల అందగాడు, డియర్ మేఘా.

ఈ రెండు చిత్రాల్లో అవసరాల శ్రీనివాస్ ప్రధాన పాత్ర పోషించిన సినిమాకు ఓ మోస్తరుగా క్రేజ్ కనిపిస్తోంది. హిందీలో వచ్చిన ‘బాలా’ తరహాలో బట్టతల చుట్టూ తిరిగే ఎంటర్టైనర్ ఇది. తెలుగు తెరపై ఎప్పుడూ చూడని ఇలాంటి కథపై ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ కనిపిస్తోంది. క్రిష్, దిల్ రాజు లాంటి ప్రముఖులు కలిసి ఈ చిత్రాన్ని నిర్మించడం విశేషం. అవసరాలనే స్వయంగా దీనికి స్క్రిప్టు సమకూర్చాడు. విద్యాసాగర్ అనే కొత్త దర్శకుడు దీన్ని రూపొందించాడు. రుహాని శర్మ కథానాయికగా నటించింది.

ఇక మరో చిత్రం ‘డియర్ మేఘా’లో తమిళమ్మాయి మేఘా ఆకాష్ లీడ్ రోల్ చేసింది. అదిత్ అరుణ్ తనకు జోడీగా నటించాడు. ఇదొక ముక్కోణపు ప్రేమకథ. ఇద్దరు అబ్బాయిల మధ్య నలిగిపోయే అమ్మాయిగా మేఘా కనిపించనుంది. సుశాంత్ రెడ్డి అనే కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందించాడు. ఈ సినిమా ట్రైలర్ ఓ మోస్తరుగా అనిపించింది. లేడీ ఓరియెంటెడ్ మూవీ కావడం, లీడ్ రోల్ చేసిన అమ్మాయి ఇంకా తెలుగు ప్రేక్షకులకు అంతగా చేరువ కాకపోవడంతో ఈ సినిమాకు అంతగా బజ్ కనిపించడం లేదు. మరి ఈ రెండు కొత్త చిత్రాలు ఇప్పుడు బాక్సాఫీస్ దగ్గరున్న అడ్వాంటేజీని ఏమేర ఉపయోంచుకుంటాయో చూడాలి.