టక్ జగదీష్.. ఈ టైటిల్ వినగానే భలేగా అనిపించింది అందరికీ. నేచురల్ స్టార్ నాని ఏదో వెరైటీ సినిమా చేస్తున్నాడని.. ఫుల్ లెంగ్త్ ఎంటర్టైనర్ చూడబోతున్నామని అంచనాల్లోకి వెళ్లిపోయారు అతడి అభిమానులు. కానీ ఇంతకుముందు రిలీజ్ చేసిన టీజర్.. ఇప్పుడొచ్చిన ట్రైలర్ ఆ అంచనాలకు భిన్నంగా కనిపించాయి. ఇంతకుముందు నానితో ‘నిన్ను కోరి’.. ఆ తర్వాత ‘మజిలీ’ సినిమా తీసిన శివ నిర్వాణ తన స్టయిల్లో క్లాస్ ఎంటర్టైనర్ తీస్తాడనుకుంటే మాస్ మసాలా సినిమా కోసం ట్రై చేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
లేటెస్ట్‌గా వచ్చిన ట్రైలర్ చూసి మెజారిటీ నాని అభిమానులు నెగెటివ్‌గానే స్పందిస్తుండటం గమనార్హం. ఇలాంటి తండ్రి కోరిక నెరవేర్చడానికి కొడుకు పంతం పట్టి పోరాడే కథలు తెలుగులో ఎన్నో చూశాం. ఇలాంటి హీరో ఎలివేషన్లు.. ఛాలెంజ్‌లు మనకు ఏమాత్రం కొత్త కాదు.
వేరే మాస్ హీరో ఎవరైనా ఇలాంటివి చేస్తే జనాలు సర్దుకుపోయేవాళ్లు కానీ.. ఎప్పుడో ఏదో కొత్తదనం కోసం ప్రయత్నించే నాని ఇలాంటి సినిమా చేయడం ఏంటి.. అది కూడా శివ నిర్వాణ దీన్ని డైరెక్ట్ చేయడం ఏంటి అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ట్రైలర్ చూస్తే మాత్రం ‘టక్ జగదీష్’ పట్ల ప్రేక్షకులకు ఏమంత ఎగ్జైట్మెంట్ కనిపించడం లేదు. ట్విట్టర్లో నిన్న సాయంత్రం నుంచి ఈ సినిమా హ్యాష్ ట్యాగ్ మీద పడ్డ ట్వీట్లు చూస్తే.. ఈ సినిమా మీద ఇంత నెగెటివిటీనా అని ఆశ్చర్యం కలగక మానదు.
‘టక్ జగదీష్’ను ఓటీటీలో రిలీజ్ చేసి నిర్మాతలు చాలా తెలివైన నిర్ణయం తీసుకున్నారని.. సినిమా మీద నమ్మకం లేకే థియేట్రికల్ రిలీజ్‌కు వెళ్లట్లేదని కూడా కామెంట్లు చేస్తున్నారు. ఒకవేళ ఈ సినిమాకు నెగెటివ్ టాక్ వస్తే మాత్రం నాని సోషల్ మీడియాకు టార్గెట్ అవుతాడనడంలో సందేహం లేదు. ఇప్పటికే ‘వి’ లాంటి పేలవమైన సినిమా చేసి దాన్ని ఓటీటీకి వదిలేయడంతో అతడిపై కౌంటర్లు పడ్డాయి. ‘టక్ జగదీష్’ కూడా తేడా కొడితే మాత్రం ట్రోలింగ్ ఒక రేంజిలో ఉంటుంది.