అతడికి పెళ్లి.. ఆమెకు రిలీఫ్

‘జబర్దస్త్’ కామెడీ షోతో చాలామంది జీవితాలు మారిపోయాయి. ఈ షో ద్వారా తమ జీవితాలను చక్కబెట్టుకున్న వాళ్ల జాబితా చాలా పెద్దదే. యాంకర్లు అనసూయ భరద్వాజ్, రష్మి గౌతమ్ మొదలుకుని.. ఇందులో స్కిట్లు చేసిన చాలామంది కమెడియన్లకు పేరుకు పేరు, డబ్బుకు డబ్బు వచ్చాయి. ఈ షో ద్వారా జీవితంలో స్థిరపడి చాలామంది ఇళ్లు కట్టుకున్నారు, కొనుక్కున్నారు. అలాగే పెళ్ళి కూడా చేసుకున్నారు.

తాజాగా ముక్కు అవినాష్ సైతం ఓ ఇంటివాడు అయ్యాడు. అతను జబర్దస్త్ ప్రోగ్రాంతోనే పాపులారిటీ సంపాదించడం తెలిసిందే. ‘బిగ్ బాస్’ షో కోసమని గత ఏడాది అతను ‘జబర్దస్త్’కు టాటా చెప్పేశాడు. ‘బిగ్ బాస్’ అతడి పాపులారిటీని పెంచింది. వేరే షోల్లో అవకాశాలు తెచ్చిపెట్టింది. ఈ షోలో భాగంగా అతను మరో పార్టిసిపెంట్‌ అరియానాతో చాలా క్లోజ్‌గా ఉన్న సంగతి తెలిసిందే.

ఆ షో అయ్యాక కూడా వీళ్లిద్దరి సాన్నిహిత్యం కొనసాగడంతో వాళ్లిద్దరూ ప్రేమ పక్షులనే పుకార్లు షికార్లు చేశాయి. అవినాష్, అరియానా పెళ్లి చేసుకుంటారనే ప్రచారం కూడా జరిగింది. కానీ ఉన్నట్లుండి అవినాష్.. ఓ అమ్మాయితో నిశ్చితార్థం చేసుకున్నాడు. తన ఎంగేజ్మెంట్ ఫొటోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. అవినాష్ పెళ్లికి రెడీ అయిపోవడంతో అరియానాతో అతడి బంధం గురించి రూమర్లకు బ్రేక్ పడింది.

అవినాష్ ఎంగేజ్మెంట్ గురించి అరియానా కూడా స్పందించింది. అతను పెళ్లి చేసుకోబోతుండటం తనకెంతో సంతోషాన్నిస్తోందని.. తమ మధ్య ఏదో ఉందని చాన్నాళ్లుగా రూమర్లు వస్తున్నాయని.. ఇక అవన్నీ ఆగిపోతాయని ఆమె అంది. అవినాష్ తనకు మంచి స్నేహితుడని.. అతడి వ్యక్తిగత జీవితం సంతోషంగా సాగిపోవాలని కోరుకుంటున్నానని అరియానా అంది. కెరీర్లో మరో స్థాయికి ఎదగాలని చూస్తున్న అరియానాకు అవినాష్ లాంటి కమెడియన్‌తో ఎఫైర్ రూమర్లు చేటు చేసేవే. అతను పెళ్లి పీటలు ఎక్కేస్తుండటం ఆమెకు రిలీఫ్ అనే చెప్పాలి.