దాదాపు ఏడాది వయసులోనే స్టార్ అయిపోయాడు అక్కినేని అఖిల్. అతను ప్రధాన పాత్ర పోషించిన ‘సిసింద్రీ’ అప్పట్లో ఒక సంచలనం. ఓ హాలీవుడ్ మూవీ స్ఫూర్తితో శివనాగేశ్వరరావు రూపొందించిన ఈ చిత్రాన్ని అక్కినేని నాగార్జునే స్వయంగా నిర్మించాడు. అందులో ఓ కీలక పాత్ర కూడా చేశాడు. ఈ సినిమాలో అఖిల్ తల్లి పాత్రలో ఆమని ఎంతగానో ఆకట్టుకుంది.
ఇప్పుడు పాతికేళ్ల విరామం తర్వాత ఆమని మళ్లీ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ మూవీలో అఖిల్‌కు తల్లిగా నటించడం విశేషం. అఖిల్‌ను చూస్తే నిజంగా తన కొడుకు లాగే అనిపిస్తుందని.. ఎప్పటికీ అతణ్ని తన బిడ్డ లాగే భావిస్తానంటూ ఒక టీవీ ఇంటర్వ్యూలో ఆమని ఎమోషనల్ అయింది. అఖిల్ కూడా తనను తల్లిలాగే చూస్తాడని ఆమె అంది.
‘సిసింద్రీ’ చేసే సమయానికి అఖిల్‌కు ఊహ తెలియదని.. కానీ తర్వాత అతను ‘సిసింద్రీ’ సినిమా చూసి తన పట్ల ఆపేక్ష పెంచుకున్నాడేమో తెలియదని.. ‘మోస్ట్ ఎలిజిబుల్’ బ్యాచిలర్ షూటింగ్ సందర్భంగా అతను తన మీద చూపించిన ప్రేమ అంతా ఇంతా కాదని ఆమని తెలిపింది. సెట్లోకి వచ్చాడంటే తాను ఎక్కడ ఉన్నానో వెతుక్కుని మరీ వచ్చి ఆప్యాయంగా పలకరిస్తాడని.. తనను ఒక అమ్మ లాగే ట్రీట్ చేస్తాడని ఆమని అంది.
ఇక తన వ్యక్తిగత జీవితం గురించి చెబుతూ.. ఓ ఆసక్తికర విషయం వెల్లడించింది ఆమని. తన తల్లికి తనతో పాటు ఒక కొడుకు ఉన్నాడని.. ఐతే ఇద్దరమ్మాయిల్ని దత్తత తీసుకుని వారిని పెంచి పెద్ద చేసి పెళ్లిళ్లు చేసి మంచి స్థితికి తీసుకొచ్చిన ఘనత తన తల్లికి దక్కుతుందని ఆమని వెల్లడించింది. తాను సినిమా అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నపుడే తన తండ్రి చనిపోయాడని.. ఆ సమయంలో తల్లే అండగా నిలిచిందని.. తాను కథానాయికగా నిలదొక్కుకున్నాక ఇంటి బాధ్యతలు తీసుకున్నానని ఆమె చెప్పింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates