ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు టాలీవుడ్‌కు పెద్ద దిక్కు అనడంలో సందేహం లేదు. దర్శకరత్న దాసరి నారాయణ రావు స్థానంలోకి ఆయన అనధికారికంగా అడుగు పెట్టేశారు. ఇండస్ట్రీని తన వంతుగా అన్ని రకాలుగా ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు. సమస్యల్ని పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. కరోనా సంక్షోభ సమయంలో చిరు ఎన్ని రకాల సేవా కార్యక్రమాలు చేశారో అందరికీ తెలిసిందే. ఇప్పుడు టాలీవుడ్ ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్యను పరిష్కరించాల్సిన బాధ్యత కూడా ఆయన మీదే పడింది.
ఆంధ్రప్రదేశ్‌లో టికెట్ల రేట్లపై నియంత్రణ వల్ల టాలీవుడ్ నిర్మాతలు ఎంతగా ఇబ్బంది పడుతున్నారో తెలిసిందే. చిన్న సెంటర్లలో పదేళ్ల కిందటి టికెట్ల రేట్లను అమలు చేస్తుండటంతో ఆదాయానికి బాగా గండి పడుతోంది. మినిమం టికెట్ రేటు రూ.100 చేయాలని, పెద్ద సినిమాలు రిలీజైనపుడు టికెట్ల రేట్లు పెంచుకునే సౌలభ్యం కల్పించాలని, అదనపు షోలు వేసుకునేందుకు అవకాశం ఇవ్వాలని ఎగ్జిబిటర్లు ఏపీ సర్కారుకు విన్నవిస్తున్నారు.
కానీ ఇప్పటిదాకా సానుకూల స్పందన లేదు. ఐతే చిరు నేతృత్వంలో త్వరలోనే ఓ బృందం ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలవబోతోంది. పైన చెప్పుకున్న సమస్యల్ని పరిష్కిరించడంతో పాటు గత ఏడాది కరోనా ఫస్ట్ వేవ్ టైంలో ఇచ్చిన కొన్ని హామీలను నెరవేర్చేలా ప్రభుత్వాన్ని ఒప్పించాల్సిన బాధ్యత చిరు బృందం మీద ఉంది.
ఈ మీటింగ్ మీద ఇండస్ట్రీ ఎన్నో ఆశలతో ఉంది. దీని పర్యవసానాల్ని బట్టి చాలా సినిమాల విడుదల ఆధారపడి ఉంది. ఇక్కడ సానుకూల ఫలితాలు రాకపోతే ఇండస్ట్రీలో అయోమయ పరిస్థితులు నెలకొంటాయి. కాబట్టి అందరూ చిరు మీద ఎన్నో ఆశలతో ఉన్నారు. కాబట్టి ఈ సమావేశంలో సానుకూల ఫలితం రాబట్టడం చిరు ఇజ్జత్ కా సవాల్ అని చెప్పొచ్చు. మరి ఈ మీటింగ్‌లో ఆయన ఏపీ ముఖ్యమంత్రితో ఎంత చాకచక్యంగా వ్యవహరిస్తారో.. ఎలాంటి ఫలితం రాబడతారో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates