ఇతణ్ని వాడుకోవాలే కానీ..

Vivaha Bojanambu

టాలీవుడ్లో కామెడీ వైభవం చాలా ఏళ్ల కిందటే పోయింది. బ్రహ్మానందం డౌన్ అయిపోవడం.. ఎమ్మెస్ నారాయణ, వేణు మాధవ్, ఏవీఎస్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం లాంటి మేటి కమెడియన్లు కాలం చేయడం.. సునీల్ హీరోగా మారి కమెడియన్ ఇమేజ్‌ను దెబ్బ తీసుకోవడంతో తెరపై నవ్వులకు కరవొచ్చేసింది.

తర్వాతి తరంలో కూడా కొందరు మంచి కమెడియన్లు ఉన్నారు కానీ.. తెరపై ముందులా కామెడీ అయితే పండట్లేదు. ఇప్పుడు తెలుగు సినిమాల్లో కామెడీ తీరే మారిపోయింది. ఇప్పుడంతా హడావుడి లేకుండా సటిల్‌గా సాగిపోతోంది. ఇలాంటి కామెడీ చేయడంలో వెన్నెల కిషోర్, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ లాంటి ఈ తరం కమెడియన్లు ప్రత్యేకత చాటుకుంటున్నారు.

ఐతే వీరి మధ్య అనుకున్నంత పేరు రాని మరో మంచి కమెడియన్ ఉన్నాడు. అతనే.. సత్య. ఇప్పటికే పదుల సంఖ్యలో సినిమాలు చేసినా.. ప్రతి చిత్రంలోనూ తనదైన కామెడీ టైమింగ్‌తో నవ్వించినా సత్యకు రావాల్సినంత పేరైతే రాలేదు.

సత్యలో ఎంత మంచి నటుడున్నాడనే విషయం తాజాగా సోనీ లివ్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘వివాహ భోజనంబు’తో రుజువైంది. ఈ చిత్రంతోనే సత్య హీరోగా మారాడు. ఫుల్ లెంగ్త్ రోల్‌లో అతను ఆద్యంతం ఆకట్టుకున్నాడు. ఆ సినిమాను అతను తన భుజాల మీద నడిపించాడంటే అతిశయోక్తి కాదు. కరోనా నేపథ్యంలో నడిచే ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్లు లేదన్న టాక్ వస్తోంది.

ట్రైలర్లో ఉన్నంత ఫన్ సినిమాలో లేదన్నది పెద్ద కంప్లైంట్. ఐతే సినిమా కొంచెం అటు ఇటుగా ఉన్నప్పటికీ సత్య మాత్రం తన నటనతో నూటికి నూరు మార్కులు వేయించుకున్నాడు. ప్రతి సన్నివేశంలోనూ తనదైన టైమింగ్‌తో నవ్వించే ప్రయత్నం చేశాడు.

సత్యను సరిగ్గా వాడుకోవాలే కానీ.. అతను ఎలా ఒక పాత్రను పండించగలడో చెప్పడానికి ‘వివాహ భోజనంబు’ రుజువు. ఈ సినిమాలో అతను కొన్ని చోట్ల ఎమోషన్లను కూడా బాగా పండించాడు. సునీల్ ఒకప్పుడు చేసిన ‘అందాల రాముడు’ స్టయిల్లో కామెడీ ప్రధాన సినిమాలు చేసుకుంటే సత్య మంచి స్థాయికి చేరుకునే అవకాశముంది.