సేతుపతి-తాప్సి.. సైలెంట్ ఎటాక్

తమిళ నటుడు విజయ్ సేతుపతి ప్రతిభ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. అతను కేవలం తెలుగు సినిమాలు మాత్రమే చేస్తున్నపుడే తన టాలెంట్ ఏంటో ఇతర భాషల వాళ్లకు కూడా బాగానే తెలిసింది. సేతుపతి కోసమే తమిళ సినిమాలు చూడ్డం మొదలుపెట్టిన పర భాషా అభిమానులు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. గ

త కొన్నేళ్లలో అతడి ప్రతిభ అంతలా విస్తరించింది. ఇక తెలుగు సినిమాలతో కెరీర్ మొదలుపెట్టి తమిళ చిత్రాల్లోనూ నటించి.. బాలీవుడ్‌కు వెళ్లి అక్కడ అద్భుతమైన పాత్రలతో మేటి నటిగా ఎదిగిన తాప్సి టాలెంట్ ఎలాంటిదో కూడా అందరికీ తెలిసిందే. ఇలాంటి ఇద్దరు ఆర్టిస్టులు కలిసి సినిమా చేస్తే ఉండే ఆసక్తే వేరు.

వీరి కలయికలో ఓ థ్రిల్లర్ మూవీ రానున్నట్లు ఈ మధ్యే వార్తలొచ్చాయి. కానీ చడీచప్పుడు లేకుండా ఆ సినిమాను పూర్తి చేసేసి విడుదలకు కూడా సిద్ధం చేసేసింది చిత్ర బృందం. ఆ సినిమా పేరును కూడా గురువారమే రివీల్ చేశారు.

అనబెల్ సేతుపతి.. ఇదీ విజయ్ సేతుపతి-తాప్సి జంటగా నటిస్తున్న సినిమా పేరు. దీపక్ సుందర్ రాజన్ ఈ చిత్రాన్ని రూపొందించాడు. సుదన్ సుందరం, జయరామ్ నిర్మించారు. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో ఒకేసారి విడుదల చేయబోతున్నారు. ఐతే ఈ చిత్రం రిలీజయ్యేది థియేటర్లలో కాదు.. ఓటీటీలో.

ఇండియాలో మంచి జోరుమీదున్న ఓటీటీల్లో ఒకటైన హాట్ స్టార్-డిస్నీ సంస్థ ‘అనబెల్ సేతుపతి’ చిత్రాన్ని రిలీజ్ చేయబోతోంది. సెప్టెంబరు 17న స్ట్రీమింగ్ డేట్ ఇచ్చారు. ఇక ఈ సినిమా ఫస్ట్ లుక్ గమనిస్తే ఇదొక హార్రర్ థ్రిల్లర్ అని అర్థమవుతోంది. సేతుపతి, తాప్సి పెళ్లి దుస్తుల్లో కనిపిస్తున్నారు. ఫస్ట్ లుక్ బ్యాగ్రౌండ్లో ఒక పెద్ద భవంతి కనిపిస్తోంది.

ఆ ఇంట్లో జరిగే అనూహ్య పరిణామాల నేపథ్యంలోనే కథ నడుస్తుందన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. మేటి పెర్ఫామర్లయిన హీరో హీరోయిన్లు కలిసి చేస్తున్న సినిమా కావడంతో ‘అనబెల్ సేతుపతి’పై అంచనాలు బాగానే ఉన్నాయి.